తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేయడంలో రాజమౌళి చేసిన అనంతమైన కృషి వల్ల ఆర్ఆర్ఆర్ కు వచ్చిన అంతర్జాతీయ ఖ్యాతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ స్టార్ హీరోకి తీసిపోని రేంజ్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో జక్కన్న బ్రాండ్ కున్న విలువ చిన్నది కాదు. దాన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా వాడేసుకుంటున్నాయి. తాజాగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే క్రెడ్ సంస్థ తన క్రెడిట్ కార్డు అమ్మకాల కోసం రాజమౌళిని అంబాసడర్ గా తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఆయనకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని జోడించింది.
ఈ కలయికలో రూపొందిన యాడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కూడా వెరైటీగా డిజైన్ చేశారు. క్రెడ్ కార్డు లేని రాజమౌళి అది లేనందువల్ల మిస్సవుతున్న ప్రయోజనాలు పొందటం కోసం వార్నర్ కు ఫోన్ చేస్తాడు. బదులుగా అతనో ఫేవర్ అడుగుతాడు. అదేంటంటే హీరోగా పెట్టి సినిమా తీయడం. తీరా ఒప్పుకున్నాక తెలుగు రాని వార్నర్ చిత్ర విచిత్రంగా నటించడం, రాజమౌళికి చుక్కలు చూపించడం జరిగిపోతాయి. ఇదంతా ఊహించుకున్న జక్కన్న భయమేసి దీనికన్నా క్రెడ్ కార్డు తీసుకోవడమే ఉత్తమమని భావించి కాల్ కట్ చేస్తాడు.
ఇప్పుడీ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మామూలుగానే మన పాటలకు డాన్సులతో రీల్స్ చేసే వార్నర్ తో ఇలాంటి క్రియేటివిటీ ప్లాన్ చేయడం బాగుంది. ఇదంతా సరే కానీ ఇంతకీ మహేష్ బాబు 29 ఎప్పుడు మొదలుపెడతారని సూపర్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఉగాదికి లాంచ్ అనే వార్త గతంలో వచ్చింది కానీ జరగలేదు. ప్రెస్ మీట్ ద్వారా ఏదైనా అనౌన్స్ మెంట్ ఇస్తారేమో అనుకుంటే అదీ కాలేదు. ఇటీవలే ఒక స్టేజి ఈవెంట్ కోసం డాన్సు ప్రాక్టీస్ చేసి మరీ వార్తల్లోకి వచ్చిన రాజమౌళి ఇప్పుడీ వార్నర్ యాడ్ తో మరోసారి ఫ్యాన్స్ మధ్య టాపిక్ గా మారారు.