ఆవేశంతో హిట్టు కొట్టిన పుష్ప విలన్

ఇంతకు ముందు మనకసలు పరిచయమే లేదు కానీ పుష్పలో అల్లు అర్జున్ ని కవ్వించే పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్ గా చూశాక ఫహద్ ఫాసిల్ మనకూ కావాల్సిన వాడయ్యాడు. కేవలం ఆ ఒక్క బ్లాక్ బస్టర్ అతని డబ్బింగ్ సినిమాలను వెల్లువలా వచ్చేలా చేసింది. ఇతని కొత్త సినిమా ఆవేశం ఇవాళ థియేటర్లలో రిలీజయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ ఫలితం చూశాక నిర్ణయించాలని నిర్మాతలు భావించడంతో మన దాకా రాలేదు. బహుశా ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ రెండు మూడు వారాల తర్వాత వచ్చినా టాలీవుడ్ లో సక్సెస్ కావడం దీనికి కారణం కావొచ్చు.

ఇక ఆవేశం విషయానికి వస్తే ఫహద్ ఫాసిల్ మీద సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో హీరో పాత్ర పేరు రంగా. బెంగళూరుకు చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు తమ సీనియర్లతో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారంతో రగిలిపోతారు. సహాయం కోసం నగరంలో పేరుమోసిన రౌడీగా చెలామణిలో ఉన్న రంగాను కలుస్తారు. అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం అనూహ్య మలుపులు తిరుగుతుంది. దీంతో మొదలు ఫహద్ ఫాసిల్ వన్ మ్యాన్ షో మొదలవుతుంది. కేవలం ఒక ఇంట్లో రోమాంచమ్ తీసి వంద కోట్లు వసూళ్లు తెచ్చిన జీతూ మాధవన్ దీనికి దర్శకుడు కావడం విశేషం.

సినిమా చూసిన మూవీ లవర్స్ లో ఫహద్ లోని కొత్త కోణం చూసి ఆశ్చర్యపోతున్నారు. స్టోరీ లైన్ చూసి ఇదేదో సీరియస్ డ్రామా అనిపిస్తుంది కానీ ఆద్యంతం నవ్విస్తూ, ఎమోషన్స్ కి గురి చేస్తూ, థ్రిల్ పంచుతూ ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజీగా ఉంది. పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ నిర్ణయం వల్ల సరిపడా థియేటర్లు స్క్రీన్లు దొరక్క ఓపెనింగ్స్ తగ్గాయి కానీ లేదంటే ఆవేశం ర్యాంపేజ్ ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నట్టు రిజల్ట్ గురించి విన్న టాలీవుడ్ నిర్మాతలు కొందరికి ఈ ఆవేశం హక్కులను కొనే పనిలో పడ్డారట. రీమేక్ కన్నా డబ్బింగ్ రూపంలో తీసుకొస్తేనే బెటర్.