కలర్ ఫోటో నుంచి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరో సుహాస్ కొత్త సినిమా ఏదైనా వస్తోందంటే ఖచ్చితంగా దాని తాలూకు సౌండ్ బిజినెస్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఉంటుంది. బడ్జెట్ తక్కువైనా సరే సిన్సియర్ గా ట్రై చేస్తాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. రైటర్ పద్మభూషణ్ లాగా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు భారీ విజయం నమోదు చేయకపోయినా కమర్షియల్ గా పాసైపోయింది. ఈ ఏడాది మొత్తం కలిపి ఆరు దాకా రిలీజులు పెట్టుకున్న సుహాస్ కొత్త మూవీ శ్రీరంగనీతులు ఎల్లుండి ఏప్రిల్ 11 థియేటర్లలో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉంది.
కానీ ప్రమోషన్ల పరంగా టీమ్ అంతగా శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించడం లేదు. ట్రైలర్ వచ్చి చాలా రోజులయ్యింది. బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్, కంచరపాలెం కార్తీక్ రత్నం ఇంకో రెండు ప్రధాన పాత్రల్లో నటించారు. సుహాస్ తాను మెయిన్ హీరో కాదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కానీ చిన్నదయినా పెద్దదయినా క్యారెక్టర్ చేశాడు కాబట్టి దాన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లేందుకు పబ్లిసిటీలో భాగమవ్వాలి. కానీ సుహాస్ తో పాటు దర్శకుడు, నిర్మాత, టీమ్ ఎవరూ ఈ దిశగా చొరవ తీసుకోవడం లేదు. ముందు రోజు హైదరాబాద్ లో ప్రీమియర్లు వేస్తున్నట్టు బుక్ మై షో చూశాక అర్థమయ్యింది.
అసలే ఐపీఎల్, ఎన్నికల వాతావరణం, బాక్సాఫీస్ దగ్గర పోటీ లాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య శ్రీరంగనీతులు ఇంత సైలెంట్ గా ఉంటే కష్టం. కాంపిటీషన్ తక్కువేం లేదు. విజయ్ ఆంటోనీ లవ్ గురు, కోన వెంకట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది రేస్ లో ఉన్నాయి. బాలీవుడ్ మల్టీస్టారర్ బడేమియా చోటేమియాని తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. అజయ్ దేవగన్ మైదాన్ కి ప్రీమియర్ల నుంచి చాలా పాజిటివ్ టాక్ ఉంది. సో శ్రీరంగనీతులు గురించి జనాల్లో ఆసక్తి పెరగాలంటే ఈ రెండు రోజుల్లో ఏదైనా అనూహ్యమైన ప్రమోషన్ యాక్టివిటీ చేయాలి. లేదంటే నెగ్గడం అంత సులభం కాదు.