ఇక సందేహాలేమీ లేవు. విజయ్ దేవరకొండ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ జమ అయినట్లే. మొదలైనపుడు.. రిలీజ్‌కు ముందు ప్రామిసింగ్‌గా కనిపించిన ‘ఫ్యామిలీ స్టార్’ చివరికి ఎవ్వరూ ఊహించనంత పెద్ద డిజాస్టర్‌గా నిలవబోతోంది. తొలి రోజు కొంచెం సందడి చేశాక రెండో రోజు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ ‘ఫ్యామిలీ స్టార్’ తర్వాత పెద్దగా పుంజుకోలేదు.
ఆదివారం ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టింది. సోమవారం పూర్తిగా చల్లబడిపోయింది. ఆక్యుపెన్సీలు 20 శాతానికి మించలేదు. ఉగాది సెలవును కూడా ఈ సినిమా పెద్దగా ఉపయోగించుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. ముందు వారం వచ్చిన ‘టిల్లు స్క్వేర్’యే బాక్సాఫీస్ లీడర్ బోర్డ్‌లో టాప్‌లో ఉంది. కొత్త సినిమా కంటే పాతదే బెటర్ అని జనం దానికే వెళ్తున్నారు. మలయాళ అనువాద చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’కు కూడా స్పందన బాగానే ఉంది.
ఎటొచ్చీ ‘ఫ్యామిలీ స్టార్’ పరిస్థితే ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇక బుధవారం నుంచి ఈ సినిమాకు షేర్ అంటూ ఏమీ రాదనే భావిస్తున్నారు. ఈ రోజు వచ్చే కలెక్షన్లే ఫైనల్ అనుకోవాలి. ఫ్యామిలీ స్టార్’ ఫుల్ రన్ వరల్డ్ వైడ్ షేర్ రూ.15 కోట్లకు మించకపోవచ్చు.
ఈ సినిమా థియేట్రికల్ హక్కుల వాల్యూ రూ.40 కోట్లు కావడం గమనార్హం. అంటే రాబట్టాల్సినదాంట్లో సగం కూడా వచ్చే పరిస్థితి లేదన్నమాట. దీన్ని బట్టే సినిమా ఎంత పెద్ద ఫ్లాపో అర్థం చేసుకోవచ్చు. నైజాం, వైజాగ్ ఏరియాల్లో నిర్మాత దిల్ రాజే సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. మిగతా ఏరియాల్లో మంచి రేట్లకు సినిమాను అమ్మారు. ఎక్కువగా ఆయన రెగ్యులర్ బయ్యర్లే సినిమాను కొన్నారు. కానీ అందరినీ నష్టాలు ఏదో రకంగా సెటిల్ చేయాల్సిందే.