నా సినిమా నేనే చూడలేకపోయా-కిరణ్ అబ్బవరం

ఒక రెండేళ్ల ముందు టాలీవుడ్లో కిరణ్ అబ్బవరం అనే పేరు గట్టిగా వినిపించింది. ‘రాజా వారు రాణివారు’ అనే ప్రేమకథా చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడతను. ఆ చిత్రం థియేటర్లలో పెద్దగా సందడి చేయకపోయినా.. ఓటీటీలో బాగా ఆడి ఈ కుర్రాడికి పేరు తెచ్చింది.

ఆ తర్వాత తనే స్క్రిప్టు రాసుకుని హీరోగా నటించిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ మంచి పాటలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, ట్రేడ్ పండిట్లు ఆశ్చర్యపోయేలా ఓపెనింగ్స్ కూడా తెచ్చుకుంది. టాక్ బాలేకున్నా ఈ సినిమా హిట్ అయింది. దీంతో కిరణ్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ వాటిలోంచి సరైన సినిమాలు ఎంచుకోకపోవడం.. ముందు వెనుక చూసుకోకుండా చకచకా సినిమాలు లాగించేయడంతో కిరణ్ కెరీర్ గాడి తప్పింది. సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు కిరణ్ కెరీర్‌ను దారుణమైన దెబ్బ కొట్టాయి.

పైన చెప్పుకున్న ఏ సినిమాను కూడా చివరి దాకా కూర్చుని చూడడం కష్టమే. ఐతే వరుసగా ఎదురు దెబ్బలు తిన్నాక కిరణ్‌కు జ్ఞానోదయం అయినట్లుంది. ఈసారి టైం తీసుకుని నెమ్మదిగా తర్వాతి సినిమా చేస్తున్నాడు. తాను చేసిన తప్పుల విషయంలో కూడా అతను ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు. తాజాగా ఒక చిట్‌చాట్‌లో భాగంగా తాను నటించిన ఓ సినిమాను తనే చివరి వరకు చూడలేకపోయిన విషయాన్ని కిరణ్ వెల్లడించాడు. ఆ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా సగం అయ్యేసరికే ఇది వర్కవుట్ కాదని అర్థమైపోయినట్లు కిరణ్ వెల్లడించాడు.

మధ్యలో లేచి వెళ్లిపోతుంటే తన టీం సభ్యులు.. ఇలా వెళ్లడం బాగుండదని అన్నారని.. కానీ సినిమా బాలేనపుడు ఏం చేస్తామని చెప్పి బయటికి వచ్చేసినట్లు కిరణ్ తెలిపాడు. ఐతే ఆ సినిమా ఏదనే విషయాన్ని కిరణ్ వెల్లడించలేదు. రూల్స్ రంజన్, మీటర్ సినిమాలు భరించలేని విధంగా ఉంటాయి కాబట్టి వాటిలో ఒకటే అయి ఉండొచ్చు. ఐతే ఇకపై తాను జాగ్రత్తగా సినిమాలు చేస్తానని కిరణ్ తెలిపాడు.