తిరుగుబాటు వీరుడిగా ప్రభాస్ ?

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమా అఫీషియలయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో రూపొందనుంది. నిజానికి హిందీలో దర్శకుడు సిద్దార్థ్ రాయ్ తో బాలీవుడ్ ఎంట్రీ చేయించాలని తొలుత ప్లాన్ చేసుకున్నారు కానీ అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఈలోగా సీతారామం బ్లాక్ బస్టర్ కావడం, హను చెప్పిన కథ హీరో నిర్మాత ఇద్దరికీ నచ్చడంతో ఫైనల్ గా తెరకెక్కబోతోంది. ఫిక్షన్ కలిపిన పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని, ఎవరూ ఊహించని అంశాలు సర్ప్రైజ్ చేస్తాయని హను రాఘవపూడి చెబుతున్నారు కానీ అంతకన్నా డీటెయిల్స్ లేవు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రభాస్ చాలా షాకింగ్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తాడని సమాచారం. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో నిజాం సర్కారు తరపున రజాకార్లు సృష్టించిన దమనకాండను ఇందులో నేపథ్యంగా తీసుకున్నారట. కాకపోతే మరీ వయొలెంట్ గా కాకుండా వాస్తవిక కోణంలో చూపిస్తూనే వాళ్ళను ఎదిరించే తిరుగుబాటు వీరుడిగా ప్రభాస్ క్యారెక్టర్ ని పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్టు లీక్ న్యూస్. ఇటీవలే రజాకార్ బ్యాక్ డ్రాప్ లో అదే టైటిల్ తో సినిమా వస్తే కొన్ని వివాదాలు రేగాయి కానీ బలమైన క్యాస్టింగ్ లేకపోవడం వల్ల ఆడియన్స్ కి అంతగా రీచ్ కాలేకపోయింది.

గతంలో నాగార్జునతో విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా ఈ సబ్జెక్టుని టచ్ చేశారు కానీ అందులో ఎమోషనల్ థ్రెడ్ ఎక్కువ ఉండటంతో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు ప్రభాస్ చేస్తాడంటే దీని రీచ్ ప్యాన్ ఇండియాని మించి ఉంటుంది. సున్నితంగా కథలను రాసుకునే హను రాఘవపూడి డార్లింగ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకత్వంలో మూడు పాటల రికార్డింగ్ పూర్తయిపోయింది. కల్కి 2898 ఏడి, ది రాజా సాబ్, సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం, స్పిరిట్ ఇలా వరస సినిమాలతో బిజీ ఉన్న ప్రభాస్ మరి హను రాఘవపూడికి ఏ నెంబర్ ఇస్తాడో.