గేమ్ ఛేంజర్ విడుదల తేదీ గురించి బయట ప్రచారాలు జరగడం తప్ప ఇప్పటిదాకా నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ఎస్విసి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం అభిమానులను కలవరపెడుతూనే ఉంది. ఈ రోజుకీ షూటింగ్ జరుగుతూనే ఉండటంతో అసలు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ లో వస్తుందని లైకా సంస్థ అధికారిక పోస్టర్ వదిలింది. ఇక్కడితో అయిపోలేదు. రామ్ చరణ్ టీమ్ మౌనాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ వాడేసుకునే పరిణామం జరిగిపోయింది.
టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టయాన్ ని అక్టోబర్ లో విడుదల చేస్తామని అనౌన్స్ మెంట్ వచ్చేసింది. డేట్ చెప్పలేదు కానీ అక్టోబర్ 10 లేదా 30 ఉండొచ్చని చెన్నై టాక్. దసరాని టార్గెట్ గా పెట్టుకుంటే దేవరతో పోటీ ఉంటుంది. వద్దు నెలాఖరుకి ప్లాన్ చేసుకుంటే గేమ్ చేంజర్ రావొచ్చు. ఇదంతా ముందే ఊహించి రజని టీమ్ తెలివిగా నెలను బ్లాక్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇదంతా చూశాకైనా దిల్ రాజు తేదీని నిర్ణయించాలని మెగా ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ తన చేతుల్లో ఏమి లేదని, శంకర్ చెప్పాలని మొన్నామధ్య చరణ్ బర్త్ డే ఈవెంట్ లో చెప్పిన సంగతి తెలిసిందే.
చూస్తుంటే తెలుగు ప్యాన్ ఇండియా సినిమాలు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా మంచి డేట్లను ఎగరేసుకుపోవడానికి వెట్టాయన్ లాగా ఇతర బాషల ప్రొడ్యూసర్లు కాచుకుని ఉన్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ లో ఆలస్యం లాంటివి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు కానీ అప్రమత్తంగా లేకపోతే ఇదిగో ఇలాంటి అనూహ్య పరిణామాలే చూడాల్సి ఉంటుంది. నాగ చైతన్య తండేల్, సూర్య కంగువాలు కూడా అక్టోబర్ ఆప్షన్ నే చూస్తున్నాయట. రాబోయే రోజుల్లో వీలైనంత అలెర్ట్ గా ఉండి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు తొందరపడకపోతే లేనిపోని చిక్కులు చవి చూడాల్సి వస్తుంది.