టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా ఇండియాలో ఏ వుడ్ చూసుకున్నా వారసత్వ నేపథ్యం ఉన్న హీరోలదే హవా. మలయాళంలో వారసత్వంతో వచ్చినా సరే గొప్ప నటులుగా పేరు తెచ్చుకుని పెద్ద స్థాయికి ఎదిగిన హీరోల్లో పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, ఫాహద్ ఫాజిల్ లాంటి వాళ్లను చెప్పుకోవచ్చు. వీరిలో పృథ్వీరాజ్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ది గోట్ లైఫ్ మూవీలో నజీబ్ పాత్ర కోసం అతను పడ్డ కష్టం.. తన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినీ పరిశ్రమలో నెపోటిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పృథ్వీరాజ్. అతడి తండ్రి సుకుమారన్ మలయాళంలో పేరున్న నటుడు. అతడి తల్లి మల్లిక కూడా నటే. నెపోటిజం ద్వారానే తనకు కెరీర్ ఆరంభంలో అవకాశాలు వచ్చినట్లు పృథ్వీరాజ్ వ్యాఖ్యానించాడు.
నాకు, దుల్కర్‌కు ఉన్న పోలిక ఏంటంటే.. మేము నెపో కిడ్స్. నాకు ఇండస్ట్రీలో సులభంగానే అవకాశాలు వచ్చాయి. నా ఇంటి పేరు చూసే తొలి అవకాశం ఇచ్చారు. ఫలానా స్టార్ హీరో కొడుకును కాబట్టి నాకు ఈజీగా అవకాశాలు వస్తాయని అందరూ మాట్లాడుకున్నారు. నాకు స్క్రీన్ టెస్ట్ కూడా చేయకుండానే తొలి సినిమాలో అవకాశం ఇచ్చారు. నాకు ఆ ఛాన్స్ ఇప్పించిన నా ఇంటిపేరుకు రుణపడి ఉంటా.
కానీ బయటి వాళ్లు ఏమన్నా అనుకోనీ.. అందరూ చెప్పే మాటే నేనూ చెబుతున్నా. వారసత్వం వల్ల తొలి అవకాశం సులువుగా వస్తుంది. కానీ ఆ తర్వాత మనల్ని నిలబెట్టేది సొంత ప్రతిభే. కష్టపడాలి. ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుని ముందుకు సాగాలి. అప్పుడే కెరీర్లో ఎదుగుతాం అని పృథ్వీరాజ్ తెలిపాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ అరడజను సినిమాల దాకా చేస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates