క్రికెట్ టెస్టు మ్యాచులో రెండు ఇన్నింగ్స్ ఉన్నట్టే ప్రతి శుక్రవారం విడుదలయ్యే హిట్ సినిమాలకు ఆపై వచ్చే కొత్త ఫ్రైడేని ఇలాగే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం టిల్లు స్క్వేర్ ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు బ్యాటు, బాలు సిద్ధం చేసుకుంటోంది. అదేంటో చూద్దాం. మొదటి వారానికే 90 కోట్ల గ్రాస్ దాటేసిన టిల్లు స్క్వేర్ మొన్న బుధ గురువారాల్లో స్వల్ప తగ్గుదల చూపించింది. ది ఫ్యామిలీ స్టార్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఇక ఫైనల్ రన్ కు దగ్గర పడినట్టేనని బయ్యర్లు ఫిక్సయ్యారు. కానీ విజయ్ దేవరకొండ బొమ్మకు సానుకూల ఫలితం కనిపించడం లేదు.
దీంతో ఒక్కసారిగా టిల్లు స్క్వేర్ బృందం అలెర్ట్ అయిపోయింది. ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తెలియడం ఆలస్యం సిద్దుకు తగ్గించిన షోలు మెల్లగా ఇటు పక్క రావడం మొదలయ్యింది. మెయిన్ స్క్రీన్లను డిస్టర్బ్ చేయడం లేదు కానీ రౌడీ హీరోకు కేటాయించిన సైడ్, ఎక్స్ ట్రా థియేటర్లు క్రమంగా షిఫ్ట్ అవుతున్నాయని ట్రేడ్ టాక్. సోమవారం నుంచి పరిస్థితి ఊహించని విధంగా మారిపోవడం ఖాయమని టిల్లు సపోర్టర్స్ మాట. ఎంతలేదన్నా ఫైనల్ రన్ ఇంకో రెండు వారాలు వచ్చేలా ఉంది కాబట్టి నూటా యాభై కోట్ల గ్రాస్ సాధ్యమనే అంచనాలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గెస్టుగా 8న సక్సెస్ ఈవెంట్ చేస్తున్నారు.
రాబోయే శుక్రవారం గీతాంజలి మళ్ళీ వచ్చింది, లవ్ గురు లాంటి కొత్త రిలీజులు ఉన్నాయి కానీ అమాంతం బాక్సాఫీస్ ని కమ్మేసే సీన్ కనిపించడం లేదు. టాక్ బ్రహ్మాండంగా వస్తే అది వేరే విషయం. దీంతో మందు ఎండల్లో వినోదం పరంగా ఫస్ట్ ఆప్షన్ టిల్లు స్క్వేర్ నిలుస్తోంది. ఈ కోణంలో చూసుకుంటే ఫ్యామిలీ స్టార్ అద్భుతమైన అవకాశాన్ని వదిలేసినట్టు అయ్యింది. సాలిడ్ గా హిట్ అనిపించుకుని ఉంటే ఇవాళ లెక్క వేరుగా ఉండేది. టికెట్లు దొరకని పరిస్థితి నెలకొనేది. బుక్ మై షోలో ఫ్యామిలీ స్టార్ కి సగటు 4 వేల టికెట్లు బుక్కవుతుంటే టిల్లు స్క్వేర్ ఎనిమిదో రోజు దానికన్నా వంద రెండు వందల టికెట్లు ఎక్కువే అమ్ముతోంది.