దిల్ రాజు మాట.. రివ్యూల‌ను అంగీక‌రిస్తాం కానీ..

గీత గోవిందం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప‌ర‌శురామ్‌ల క్రేజీ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన సినిమా.. ఫ్యామిలీ స్టార్. ఈ కాంబినేష‌న్‌కు తోడు దిల్ రాజు ప్రొడ్యూస్ చేయ‌డం, తెలుగులో ఇప్ప‌టికే రెండు పెద్ద హిట్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ క‌థానాయిక‌గా న‌టించ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. కానీ ఆ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయిందీ చిత్రం. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వ‌చ్చాయి. చాలా వ‌ర‌కు లో రేటింగ్సే ప‌డ్డాయి.

ఐతే త‌మ సినిమాకు నెగెటివ్ రివ్యూలు వ‌స్తే నిర్మాత‌లు ఫీల‌వ‌డం.. స‌మీక్ష‌కుల‌ను విమ‌ర్శించ‌డం మామూలే. కానీ దిల్ రాజు మాత్రం రివ్యూయ‌ర్ల ప‌ట్ల సానుకూలంగానే స్పందించాడు. తాము సినిమాకు వ‌చ్చిన స‌మీక్ష‌ల‌ను అంగీక‌రిస్తామ‌న్నాడు.

రివ్యూయ‌ర్ల ప‌ని రివ్యూయ‌ర్లు చేశార‌ని.. తాను ప్ర‌తి సినిమాకు జెన్యూన్‌గా ఫీడ్ బ్యాక్ తీసుకుంటాన‌ని.. ఫ్యామిలీ స్టార్ విష‌యంలోనూ స‌మీక్ష‌కులు ఇచ్చిన రివ్యూలు, రేటింగ్స్‌ను అంగీక‌రిస్తామ‌ని రాజు అన్నాడు. ఐతే రివ్యూలు నెగెటివ్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల నుంచి మాత్రం 90 శాతం సానుకూల స్పంద‌న వ‌స్తోంద‌ని.. కుటుంబ ప్రేక్ష‌కులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నార‌ని దిల్ రాజు చెప్పాడు. త‌న‌తో ట‌చ్‌లో ఉండే మీడియా వాళ్లు కూడా ప్రెస్ షోకు ఫ్యామిలీస్‌తో హాజ‌రై తాము సినిమాను బాగా ఎంజాయ్ చేసిన‌ట్లు చెప్పార‌ని రాజు తెలిపాడు. థియేట‌ర్ల‌లో చాలా స‌న్నివేశాల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంద‌ని రాజు అన్నాడు.

సినిమా ద్వితీయార్ధం అంతా అమెరికాలో క‌థ న‌డ‌వ‌డంపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావ‌డంపై రాజు స్పందిస్తూ.. మొత్తం క‌థ‌ను ఇక్క‌డే ఫ్యామిలీ మ‌ధ్య తీస్తే టీవీ సీరియ‌ల్ తీశార‌ని అంటార‌ని.. అందుకే యూత్‌కు కూడా క‌నెక్ట్ అయ్యేలా క‌థ‌ను అక్క‌డికి షిఫ్ట్ చేశామ‌ని చెప్పాడు.