దిల్ రాజు మర్చిపోలేని ఒక్క ఫ్లాప్

కుటుంబ సమేతంగా చూసే సినిమాలకు ఎస్విసి బ్యానర్ పెట్టింది పేరు. నిర్మాత దిల్ రాజు ఎన్ని కమర్షియల్ చిత్రాలు తీసినా సంస్థ పేరుని క్లాసు మాసు అందరికీ చేరేలా చేసింది మాత్రం ఫ్యామిలీ మూవీసే. అందుకే ఈ జానరంటే ఆయనకు అంత ఇష్టం. కథల ఎంపికలో క్యాలికులేటెడ్ గా ఉండే ఈ అగ్ర నిర్మాత ఇంత అనుభవమున్నా సరే ఒక్కోసారి లెక్క తప్పడం సహజం. ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దీని గురించి దిల్ రాజు ఓపెనయ్యారు. బొమ్మరిల్లు నుంచి బలగం దాకా ఎన్నో అద్భుతమైన క్లాసిక్స్ ని ప్రేక్షకులు ఆదరించారని ఒక్కసారి మాత్రమే అంచనా తప్పిందని చెప్పారు.

అదే శ్రీనివాస కళ్యాణం. నితిన్, రాశిఖన్నా జంటగా రూపొందిన ఈ మ్యారేజ్ డ్రామాకి రిలీజ్ కు ముందు దిల్ రాజు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. శతమానం భవతి లాంటి అవార్డు విన్నింగ్ సినిమా ఇచ్చిన సతీష్ వేగ్నేశ దర్శకుడు కావడంతో జనాలు తండోపతండాలుగా వస్తారని ఊహించారు. కానీ జరిగింది వేరు. మంచి కాన్సెప్ట్ అయినప్పటికీ ఎంటర్ టైన్మెంట్ కి బదులు పెళ్లి ఎలా చేయాలనే దాని మీద క్లాసులు ఎక్కువ తీసుకోవడంతో తిరస్కారం ఎదురయ్యింది. దీని దెబ్బకే ఇదే సతీష్ తో దిల్ రాజు తర్వాత ప్లాన్ చేసుకున్న థాంక్ యుని ఆపేయాల్సి వచ్చింది. ఆ టైటిల్ ని చైతుకి వాడుకున్నారు.

ప్రత్యేకంగా ఈ ఒక్క సినిమా పేరునే దిల్ రాజు చెప్పడం చూస్తే నమ్మకం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ స్టార్ మీద మాత్రం వన్ పర్సెంట్ డౌట్ కూడా లేదంటున్నారు. అన్ని వర్గాల కుటుంబాలకు దగ్గరయ్యే రేంజ్ లో దర్శకుడు పరశురామ్ తీర్చిదిద్దారని, విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంట మధ్య ఎమోషన్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తారని హామీ ఇస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద డీజే టిల్లు హడావిడి జరుగుతున్న నేపథ్యంలో దానికి ధీటుగా ఓపెనింగ్స్ తెచ్చుకునేందుకు విజయ్, మృణాల్ తో సహా అందరూ పబ్లిసిటీలో రోజూ భాగమవుతున్నారు. దిల్ రాజు దగ్గరుండి చూసుకుంటున్నారు.