చివరి కోరిక తీరని ఘర్షణ పోలీస్

తెలుగులో చిరుత, టక్ జగదీష్ సాంబ, సాహసం శ్వాసగా సాగిపో లాంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న డేనియల్ బాలాజీకి ఎక్కువ గుర్తింపు తెచ్చింది మాత్రం ఘర్షణే. వెంకటేష్ బృందంలో కీలక సభ్యుడిగా తమిళంలో చేసిన పాత్రే ఇక్కడ పోషించి సూపర్ హిట్ లో భాగమయ్యాడు. ప్రముఖ హీరో మురళి సోదరుడిగా ఇండస్ట్రీకి వచ్చినా తనకంటూ స్వంత గుర్తింపు కోసం కష్టపడుతూ వచ్చాడు. సంపాదించిన దాంట్లో అధిక శాతం తన ఊరిలో గుడి నిర్మాణం కోసం వెచ్చించిన డేనియల్ కు పరిశ్రమలో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే కడచూపు కోసం ఎంతో మంది వచ్చారు.

అలాంటి డేనియల్ బాలాజీ ఇవాళ హఠాత్తుగా గుండెజబ్బుతో కన్నుమూయడం అందరినీ కలవరపరిచింది. అయిదు పదుల వయసు దాటకుండా ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడికి ఇలా జరగడం విషాదమే. అయితే తన కోరిక తీరకుండానే కన్నుమూయడం స్నేహితులను ఇంకా బాధ పెడుతోంది. స్వంతంగా దర్శకత్వం చేయాలని ప్లాన్ చేసుకున్న డేనియల్ బాలాజీ స్నేహితుడు ఎంఆర్ గణేష్ ని నిర్మాతగా సెట్ చేసుకున్నాడు. తమిళ తెలుగు కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందించాలని కథను రాసుకున్నాడు. వేరే హీరోతో తానో ముఖ్య పాత్రలో తీసేలా స్క్రిప్ట్ తీర్చిదిద్దారు.

తీరా చూస్తే విధి రాత మరోలా నిర్దేశించింది. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయకపోయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేనియల్ బాలాజీకి దర్శకుడు శివ నిర్వాణ నాని టక్ జగదీష్ లో కీలక పాత్ర ఇచ్చాడు. అయితే థియేటర్ రిలీజ్ కాకపోవడం, డైరెక్ట్ ఓటిటిలో వచ్చినా నెగటివ్ ఫలితం అందుకోవడం వల్ల బ్రేక్ దక్కలేదు. 2002 తమిళ చిత్రం ఏప్రిల్ మాదాతిల తో డెబ్యూ చేసిన డేనియల్ బాలాజీ జూనియర్ ఎన్టీఆర్ సాంబతో తెలుగు ఎంటరు ఇచ్చాడు. గత ఏడాది రిలీజైన అరియవన్ తర్వాత మళ్ళీ తెరమీద కనిపించలేదు. తన అనారోగ్యం ప్రేక్షకులకు శాశ్వతంగా దూరం చేసింది.