కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇక్కడా ఫాలోయింగ్ ఎక్కువే. గత కొన్నేళ్లలో హిట్లు తగ్గిపోయి మార్కెట్ పడిపోయింది కానీ సరైన కంటెంట్ పడితే తెలుగులో ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయో జైలర్ నిరూపించింది. లాల్ సలామ్ తీవ్రంగా నిరాశపరిచినా దాని ప్రభావం రజని మీద మరీ నెగటివ్ అయితే పడలేదు. ప్రస్తుతం వెట్టయాన్ చేస్తున్న రజని దీని తర్వాత లోకేష్ కనగరాజ్ తో ఓ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల ఏప్రిల్ 22 టైటిల్ ప్రకటించబోతున్నాడు. ప్రీ లుక్ తోనే అంచనాలు పెంచేసింది టీమ్. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన లీక్ బయటికి వచ్చింది.
ఈ చిత్రంలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లింగ్ చేసే మాఫియా డాన్ గా కనిపిస్తారట. నలభై ఏళ్ళ క్రితం ఇండియాలో బంగారం దొంగ రవాణా విపరీతంగా ఉండేది. సింగపూర్, దుబాయ్, యుఎస్ తదితర దేశాల నుంచి రహస్య మార్గాల ద్వారా కోట్ల రూపాయల పసిడి మార్కెట్ లో చెలామణి అయ్యేది. ఇప్పట్లా ఆ టైంలో ఎయిర్ పోర్ట్ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేది కాదు. దాన్ని బాగా వాడుకునేవారు. ట్రైన్లు, బస్సులు కీలకంగా వ్యవహరించేవి. అడవి మార్గాలు అదనం. ఇదంతా బ్యాక్ డ్రాప్ గా తీసుకుని లోకేష్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని చెన్నై వర్గాల భోగట్టా.
ఇదే కనక నిజమైతే ఫ్యాన్స్ కి పండగే. ఇంత వయసులోనూ రాష్ట్రాలు తిరుగుతూ ఎడతెరిపి లేకుండా షూటింగుల్లో పాల్గొంటున్న రజనీకాంత్ ఇంకో మూడు నాలుగేళ్లు ఇదే స్పీడ్ చూపించాలని డిసైడయ్యారట. లోకేష్ కనగరాజ్ ఇది కాగానే ఖైదీ 2కి సంబంధించిన పనులు మొదలుపెట్టబోతున్నాడు. రోలెక్స్ కూడా 2026లో రావొచ్చని టాక్. కెరీర్ మొత్తం లో పది సినిమాలు తీసి రిటైర్ అయిపోతానని చెబుతున్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఆ పని మాత్రం చేయకూడదని మన మూవీ లవర్స్ కోరుకుంటున్నారు. అదే జరిగితే అతను అనుకున్న ప్రభాస్, రామ్ చరణ్ లతో సినిమాలు సాధ్యం కావు.
Gulte Telugu Telugu Political and Movie News Updates