తేజు నిర్ణయాలు గురి తప్పుతున్నాయా

గత ఏడాది విరూపాక్ష రూపంలో సాలిడ్ సూపర్ హిట్ అందుకున్న సాయి దుర్గ తేజ్ కొత్త సినిమాకు సంబంధించి ఎలాంటి కబుర్లు వినిపించడం లేదు. ఇంతకు ముందు సంపత్ నంది దర్శకత్వంలో ప్రకటించిన గాంజా శంకర్ ఉందో లేదో చెప్పడం లేదు. క్యాన్సిలయ్యిందని మీడియా అడిగితే మీకే ఎక్కువ తెలుసు నన్ను అడగకండని తప్పించుకోవడం తప్ప క్లారిటీ ఇవ్వలేదు. సదుద్దేశంతో తీసిన సత్య షార్ట్ ఫిలింని ప్రమోట్ చేయడం కోసం తప్ప ఇంకెక్కడా తేజు కనిపించడం లేదు. ఫాన్స్ నిర్వహిస్తున్న రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు గెస్టుగా హాజరవుతున్నాడు.

సరే గాంజా శంకర్ సంగతి కాసేపు పక్కనపెడితే విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తానని ఆ టైంలోనే ప్రకటించాడు. కొన్ని నెలల తర్వాత సుకుమార్ రైటింగ్స్ లో ఒక మిస్టిక్ థ్రిల్లర్ ని అనౌన్స్ చేసి ఒక ప్రీ లుక్ వదిలారు. అందులో హీరో పేరు లేదు. అందరూ సాయి తేజ్ అనుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడా కథనే నాగ చైతన్య నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు ఎస్ చెప్పినట్టు టాక్ వస్తోంది. కార్తీక్ దండు రాసుకున్న స్టోరీలో ముందు సాయి తేజ్ నే అనుకుని ప్లాన్ చేశారని, కానీ బయటికి చెప్పని కారణాల వల్ల అది చైతుకి వెళ్లిందనే ప్రచారం కూడా ఉంది.

వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా సాయి దుర్గ తేజ్ వీలైనంత త్వరగా కొత్త సినిమా మొదలుపెట్టాలి. ఎక్కువ గ్యాప్ రావడం కరెక్ట్ కాదు. ఒకపక్క వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వరస ఫ్లాపులతో మార్కెట్ ని రిస్క్ లో పడేసుకున్నారు. రెండో తరం మెగా జెనరేషన్ లో రాణిస్తున్నది రామ్ చరణ్, అల్లు అర్జున్ లు మాత్రమే. తర్వాత స్టార్ గా ఎదిగేందుకు స్కోప్ ఉన్న సాయి దుర్గ తేజ్ వీలైనంత క్రేజీ కాంబోలను సెట్ చేసుకోవడం అవసరం. కేవలం మావయ్య పవన్ కళ్యాణ్ తో నటించిన ఆనందం తప్ప బ్రో వల్ల కలిగిన ఉపయోగం ఏం లేదు. స్వంతంగా ప్రొడక్షన్ మొదలుపెట్టిన తేజ్ నెక్స్ట్ ప్రణాళిక ఏంటో మరి.