పెద్ద హీరో ఉంటే చాలు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఓటిటితో రికవరీ చేసుకుని హ్యాపీగా ఉందామనుకుంటే ఆ రోజులు పోయేలా ఉన్నాయి. దానికి రెండు ఉదాహరణల గురించి ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ జరుగుతోంది. వాటిలో మొదటిది దక్షిణాదిలోనే అత్యంత క్రేజ్ ఉన్న స్టార్ ది. ముందు క్యామియో అని చెప్పి తర్వాత నిడివి పెంచి ప్రేక్షకులకు తలనొప్పి వచ్చే రేంజ్ లో డిజాస్టర్ ఇచ్చారు. షూటింగ్ టైంలో ఇరవై నిమిషాల ఫుటేజ్ పోవడంతో హడావిడిగా ఎడిటింగ్ చేసి థియేటర్లకు వదిలి నిర్మాతకు నష్టం మిగిల్చారు. ఇది ఈ వారం ఒక ఇంటర్నేషనల్ ఓటిటిలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది.
కానీ మాకు చెప్పిన అవుట్ ఫుట్ ఇవ్వని కారణంగా ముందు చెప్పిన రేట్ ఇవ్వలేమని సదరు ఓటిటి తెగేసి చెప్పడంతో డిజిటల్ రిలీజ్ ఆగిపోయింది. రీ షూట్ చేసి ఇవ్వండి లేదా ఇక్కడితో మర్చిపోండని అనడంతో నిర్మాత దిక్కుతోచని స్థితిలో ఉన్నారని టాక్. మరొకటి బాలీవుడ్ మూవీ. గత ఏడాది దసరాకు రిలీజ్ చేసిన ఈ సూపర్ హీరో మూవీలో క్రేజీ క్యాస్టింగ్ ఉంది. మొదటి రోజే దారుణమైన టాక్ తో పావు వంతు పెట్టుబడి కూడా వెనక్కు తేలేదు. ఎంత పబ్లిసిటీ చేసినా, వివిధ భాషల్లో డబ్బింగులు సిద్ధం చేసినా ఆడియన్స్ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.
ఏ మాత్రం క్వాలిటీ లేని సినిమాని మాకిస్తారాని ముందు అగ్రిమెంట్ చేసుకున్న 70 కోట్లను ఇవ్వడానికి ఓటిటి కంపెనీ నిరాకరించడంతో ప్రొడ్యూసర్ లీగల్ నోటీసులు పంపాడట. కోర్టుకు వెళ్లినా సరే వెనక్కు తగ్గేది లేదని పరస్పరం న్యాయస్థానంలో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నారట. ఇక్కడ చెప్పిన రెండు సినిమాలు ఒకే అంతర్జాతీయ ఓటిటి కొనుక్కుంది. పాలసీ విషయంలో చాలా కఠినంగా వ్యవరిస్తుందని పేరున్న ఈ సంస్థ దెబ్బకు అగ్ర నిర్మాతలు ఒక్కసారిగా అలెర్ట్ అయిపోయారట. ఇకపై ఇలాంటి సమస్యలు రాకూడదని అనుకుంటే నాణ్యత విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే.