క్రియేటివ్ ఆలోచనలు ఉండాలే కానీ ఇండస్ట్రీలో సంపాదించుకునే మార్గాలు బోలెడు. అలాగే కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందనేది మరో సామెత. ఈ రెండు గుర్తొచ్చేలా చేస్తున్నారు ఓ దర్శకుడు. పేరుకు బాలీవుడ్డే అయినా అనురాగ్ కశ్యప్ గురించి తెలియని మూవీ లవర్స్ ఉండరు. బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ లాంటి గొప్ప క్లాసిక్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఈయన స్వంతం. నటుడిగానూ సౌత్ సినిమాల్లో తరచు కనిపిస్తూ ఉంటాడు. గత కొన్నేళ్లుగా అనురాగ్ ఫామ్ దారుణంగా పడిపోయింది. ఆడియన్స్ ని కనీస స్థాయిలో మెప్పించలేక ఫెయిలవుతున్నాడు.
మరి దీని వల్ల చిరాకు పుట్టిందో లేక అప్ కమింగ్ డైరెక్టర్లు సతాయిస్తున్నారో ఏమో కానీ ఇకపై తనతో స్టోరీ డిస్కషన్ల కోసం సమయం గడపాలంటే డబ్బులు చెల్లించాలని దానికి సంబంధించిన రేట్లను ఇన్స్ టాలో పోస్ట్ చేశాడు. పదిహేను నిమిషాలకు 1 లక్ష, అరగంటకు 2 లక్షలు, పూర్తి గంటకు 5 లక్షలు అడ్వాన్స్ రూపంలో చెల్లించాక తన దగ్గరకు రావాలని షరతు పెట్టాడు. కొత్తవాళ్లను దగ్గరికి రానిచ్చి ఎంతో చెత్తను భరించానని, ఇకపై తన వల్ల కాదని, మేధావులుగా భావించే కొందరి కోసం విలువైన టైంని అనవసరంగా ఖర్చు పెట్టలేనని చెబుతూ పోస్ట్ చేయడం వైరలవుతోంది.
అనురాగ్ కశ్యప్ దోబారా మొన్నటి ఏడాది దారుణంగా బోల్తా కొట్టింది. ఓటిటి కోసం తీసిన చోక్డ్, ఘోస్ట్ స్టోరీస్ సైతం నెగటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. కెన్నెడీ అనే మరో మూవీ ఫిలిం ఫెస్టివల్స్ లో చప్పట్లు కొట్టించుకుంది కానీ థియేట్రికల్ రిలీజ్ చేద్దామంటే బయ్యర్లు ముందుకు రావడం లేదు. అందుకేనేమో దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చి ఇలా చర్చల ద్వారా డబ్బులు సంపాదించే మార్గం వెతికినట్టు ఉన్నారు. విశేషం ఏంటంటే దీనికి స్పందన వస్తోందట. సొమ్ములు ఖర్చయినా పర్వాలేదు మాకు జ్ఞానం కావాలని అకౌంట్ డీటెయిల్స్ అడుగుతూ కొందరు మెయిల్స్, ఫోన్లు చేస్తున్నారట. బాగుంది కదూ.