ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాలతో విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ అంచనాలను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌తో మహేష్ మూవీ అనేసరికి ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ అందుకు తగ్గ స్థాయిలో సినిమా లేకపోయిన మాట వాస్తవం. నిజానికి ఆ సినిమా మిడ్ నైట్ షోలకు వచ్చిన టాక్ చూస్తే.. డిజాస్టర్ అవుతుందేమో అన్న భయాలు కలిగాయి. కానీ సంక్రాంతి సీజన్లో సినిమా ఓ మోస్తరు వసూళ్లతో ఓకే అనిపించింది. కానీ చివరికి బయ్యర్లకు కొంత నష్టాలు తప్పలేదనే డిస్కషన్లే నడిచాయి ఇండస్ట్రీలో.
కానీ ఇదంతా మీడియా బాధే తప్ప.. తమకు వసూళ్ల పరంగా సమస్యే లేదంటున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్‌లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘టిల్లు స్క్వేర్’కు సంబంధించిన ప్రెస్ మీట్లో ‘గుంటూరు కారం’ తాలూకు అసంతృప్తి గురించి అడిగితే ఆయన ఆసక్తికర రీతిలో స్పందించాడు.
‘గుంటూరు కారం’ విషయంలో బాధంతా మీడియాదే అని.. తమకైతే ఆ మూవీ విషయంలో ఏ బాధా లేదని ఆయన తేల్చేశారు. అంటే నిర్మాతలుగా తాము హ్యాపీ, అలాగే సినిమాను కొన్న బయ్యర్లూ హ్యాపీ.. అందరికీ ఈ చిత్రం లాభాలే మిగిల్చిందనే భావన వచ్చేలా ఆయన మాట్లాడారు. ఐతే మీడియాకు కౌంటర్ వేయడం బాగుంది కానీ.. ఈ సినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లు మాత్రం సేఫ్ జోన్లోకి రాలేదన్నది ట్రేడ్ వర్గాల మాట. స్వయంగా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకే కొంత నష్టం తప్పలేదని ఇండస్ట్రీలో జోరుగా చర్చ జరిగింది. మిగతా ఏ ఏరియాలోనూ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదన్నదే ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రావాల్సిన కొత్త చిత్రం ఎప్పుడు ఉంటుందో చెప్పమని అడిగితే నాగవంశీ సమాధానం దాటవేశాడు. దాని గురించి వేరే ప్రెస్ మీట్లో మాట్లాడతానన్నాడు.