మూడు నెలల కిందట సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పటి నుంచి బాలీవుడ్‌లో ఒక అలజడి కనిపిస్తోంది. అతడి మృతికి బాలీవుడ్ బడా బాబులు, నెపోటిజం బ్యాచే పరోక్షంగా కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నది పక్కన పెడితే.. సామాన్య జనాల నుంచి బాలీవుడ్లో ఓ వర్గం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఆ ప్రభావం వారి సినిమాల మీద కూడా పడింది. సడక్-2 సినిమానే అందుకు ఉదాహరణ.
మరోవైపు కరణ్ జోహార్, సోనాక్షి సిన్హా లాంటి వాళ్లు సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ కేసు తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇది కొత్త మలుపు తిరిగి ఇప్పుడు డ్రగ్స్ ఆరోపణల్లో చిక్కుకుంది బాలీవుడ్. సుశాంత్ మృతి విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న అతడి ప్రేయసి రియా చక్రవర్తిని డ్రగ్స్ తీసుకుందన్న ఆరోపణలతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆమె అరెస్టుతోనే బాలీవుడ్లో అలజడి రేగింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, సైమోన్ ఖంబట్టా లాంటి వాళ్ల పేర్లు చెప్పిన రియా.. వారిని ఈ కేసులోకి లాగడంతో బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేగింది. పైకి ఎవరికి వాళ్లు గంభీరంగా కనిపిస్తున్నారు కానీ.. లోలోన అందరూ షేకైపోతున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఇలా పేర్లు చెప్పడం మొదలుపెడితే.. ఆ జాబితా చాలా పెద్దదే ఉంటుందని.. మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్లందరి పేర్లూ బయటికి వస్తాయని.. బయట చాలా మంచి ఇమేజ్ ఉన్న చాలామంది డ్రగ్ అడిక్ట్‌లే అని.. ఆ విషయం బయటపడితే వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుందని.. ఈ ఆరోపణలు, కేసులు ఎంత వరకు నిలబడతాయన్నది పక్కన పెడితే.. తమ పేర్లు బయటికి వచ్చి ఇమేజ్ దెబ్బ తింటే అంతే సంగతులని వాళ్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని బాలీవుడ్ మీడియా అంటోంది.
టాలీవుడ్లో ఇంతకుముందు డ్రగ్ కేసు ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. చివరికి ఈ కేసు నీరుగారిపోయినప్పటికీ.. పోలీసుల విచారణకు హాజరైన వాళ్ల ఇమేజ్ మాత్రం దెబ్బ తింది. ఇప్పుడు బాలీవుడ్ జనాల భయం కూడా ఇదే.