షారుఖ్ ఖాన్.. సరిగ్గా మూడేళ్లకు


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇన్నేళ్ల కెరీర్లో ఎన్నడూ లేని విధంగా రెండేళ్ల పాటు సినిమా చేయకుండా ఉండిపోయాడు. 2018 క్రిస్మస్‌కు అతను ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘జీరో’ సినిమా విడుదలై.. దారుణ ఫలితాన్నందుకుంది. అంతకుముందు కొన్నేళ్లుగా షారుఖ్‌కు హిట్టు లేదు. కచ్చితంగా హిట్టవుతుందనుకున్న ఈ చిత్రం కూడా డిజాస్టర్ కావడంతో దాదాపు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు కింగ్ ఖాన్. ఏడాది పాటు కొత్త సినిమా ఊసే ఎత్తలేదు.

తర్వాత గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానితో ఓ సినిమా ఖరారైందని.. త్వరలోనే ఆ చిత్రం మొదలవుతుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటిదాకా దాని గురించి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఆ సినిమా ఎప్పుడు మొదలై, ఎప్పుడు పూర్తయి, ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ లేదు. హిరాని చాలా నెమ్మదిగా సినిమా తీస్తాడన్న సంగతి తెలిసిందే. దీంతో 2021లో కూడా షారుఖ్‌ను తెరపై చూసే అవకాశం లేదని నిరాశలో ఉన్నారు అభిమానులు.

ఐతే వాళ్లకు ఆనందాన్నిచ్చే అప్ డేట్ బయటికొచ్చింది. హిరాని సినిమాతో పాటే యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో బ్లాక్‌బస్టర్ మూవీ ‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్‌తో షారుఖ్ ‘పఠాన్’ పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇంతకుముందు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఖరారవ్వడమే కాదు.. దాని షూటింగ్, రిలీజ్ వివరాలు కూడా బయటికొచ్చాయి. ఇందులో జాన్ అబ్రహాం విలన్‌గా నటించనున్నాడు. ఈ ఏడాది చివర్లోనే ‘పఠాన్’ పట్టాలెక్కబోతోంది.

హిరాని సినిమా కంటే ముందే దీన్ని షారుఖ్ మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తయింది. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. ‘వార్’ లాగే వివిధ దేశాల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని షూట్ చేయనున్నారు. ఐతే ఆరే ఆరు నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించారు. వచ్చే ఏడాది మధ్య కల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు చేసి ఏడాది చివర్లో, క్రిస్మస్ కానుకగా ‘పఠాన్’ను రిలీజ్ చేస్తారట. అంటే ‘జీరో’ వచ్చిన మూడేళ్లకు షారుఖ్ మళ్లీ బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నాడన్నమాట.