సుమంత్ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచిన సత్యం సినిమా దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పచ్చ కామెర్ల వ్యాధి వల్ల ఇవాళ తుది శ్వాస తీసుకున్నారు. సత్యం విజయవంతమయ్యాక ఇతనికి మంచి అవకాశాలు దక్కాయి. సత్యం తర్వాత 2003లో తిరిగి అదే హీరోతో ధన 51 చేశాడు. జగపతిబాబుతో బ్రహ్మాస్త్రం తీశాడు. మంచు మనోజ్ రాజు భాయ్ సైతం మ్యూజికల్ గా పేరు తెచ్చుకున్నదే. కానీ దురదృష్టవశాత్తు ఇవన్నీ డిజాస్టర్లు కావడంతో సూర్య కిరణ్ కెరీర్ ముందుకెళ్ళలేదు.
చివరి చిత్రం చాప్టర్ 10 సైతం ఫెయిల్యూర్ గా మిగిలింది. హీరోయిన్ కళ్యాణితో వైవాహిక జీవితం గడిపిన సూర్య కిరణ్ ఆ తరువాత విడిపోయాడు. చైల్డ్ ఆర్టిస్టుగా మాస్టర్ సురేష్ పేరుతో రెండు వందలకు పైగా సినిమాల్లో ఇతను రాణించడం చాలా పేరు తీసుకొచ్చింది. చెల్లి సుజిత సైతం బాల నటే. పసివాడి ప్రాణంతో మొదలుపెట్టి అన్నయ్యకు పోటీగా నటించేది. ఇప్పుడు టీవీ సీరియల్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. సూర్య కిరణ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నాడు. త్వరగా ఎలిమినేట్ కావడంతో ఉనికిని చాటుకోలేకపోయాడు.
టాలెంట్ ఉన్నా సరైన కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల డైరెక్టర్ గా సూర్య కిరణ్ పెద్ద స్థాయికి వెళ్లలేకపోవడం దురదృష్టం. 2017లో కంబ్యాక్ ఇవ్వాలని బలంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. నిర్మాతలు దొరక్కపోవడంతో స్వయంగా ప్రొడ్యూసర్ గా మారాలని చూసినా ప్రయోజనం దక్కలేదు . అంతకు ముందే కొన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడని సన్నిహితుల మాట. హిట్ ఒకటే అయినా గుర్తుండిపోయే చిత్రం ఇచ్చిన దర్శకుడు సూర్య కిరణ్ ముద్రని విస్మరించలేం.