వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది తమిళనాడు. ఆ ఎన్నికలు నభూతో అన్న రీతిలో ఉండబోతున్నాయన్నది స్పష్టం. ఎందుకంటే దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్ని శాసిస్తూ వచ్చిన జయలలిత, కరుణానిధి ఇప్పుడు లేరు. వారు లేకుండా సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఎన్నికలివి. వారి పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకేల పరిస్థితి ఒకప్పటితో పోలిస్తే భిన్నంగా ఉంది.
జయలలిత మరణించడం, కరుణానిధి మంచానపడటంతో నెలకొన్న రాజకీయ శూన్యతను అడ్వాంటేజ్‌గా మార్చుకుందామని ఇటు కమల్ హాసన్, అటు రజనీకాంత్ ఒకరి తర్వాత ఒకరు రాజకీయాల్లోకి వచ్చేయబోతున్నట్లు ప్రకటించారు. కమల్ పార్టీ కూడా ప్రకటించాడు. గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టాడు. కానీ అది నామమాత్రపు పోటీనే. ఆయన దృష్టంతా ఇంకో ఎనిమిది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల మీదే ఉంది.
మధ్యలో రాజకీయాలు పక్కన పెట్టి సినిమాలు, ఇతర విషయాలపై దృష్టిసారించిన కమల్.. ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ పార్టీ వ్యవహారాలపై దృష్టిపెట్టారు. ఆయన ఇప్పట్నుంచే అభ్యర్థలు ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని అన్ని జిల్లాల కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక మీద దృష్టిసారించారు.
ఎన్నికల ప్రచారం, అధికార పార్టీపై పోరాటం లాంటి విషయాల్లో కార్యాచరణ రూపొందించారు. ఎన్నికల్లో పొత్తు గురించి కూడా ఆయన పార్టీ నాయకులతో చర్చిస్తున్నారట. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ షో చేస్తున్న కమల్.. పరిస్థితులు మెరుగుపడితే ఒక రెండు నెలలు ‘ఇండియన్-2’ పని పూర్తి చేసి.. ఆ తర్వాత పూర్తిగా ఎన్నికల మీదే దృష్టి నిలపాలనుకుంటున్నారు.
ఐతే కమల్ ఇలాంటి ప్రణాళికల్లో ఉంటే.. ఆయనకంటే ఎక్కువ పాపులారిటీ ఉన్న రజనీ మాత్రం ఇంకా రాజకీయాలపై మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తానని చెప్పడానికే ఎన్నో ఏళ్లు సమయం తీసుకున్న ఆయన.. ఇప్పటిదాకా పార్టీ పేరును కూడా ప్రకటించలేదు. రెండేళ్లుగా ఆయన దృష్టంతా సినిమాల మీదే ఉంది. మరి ఇంకెప్పుడు పార్టీని ప్రకటించి.. జనాల్లోకి వెళ్తాడో.. ఎన్నికల సందర్భంగా ఆయన వ్యూహం ఎలా ఉంటుందో అర్థం కాకుండా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates