శేఖ‌ర్ క‌మ్ముల.. ఇలా షాకిచ్చాడేంటి?

శేఖర్ క‌మ్ముల అంటే సెన్సిబుల్ చిత్రాల‌కు పెట్టింది పేరు. రీమేక్ మూవీ అయిన అనామిక‌ను మిన‌హాయిస్తే ఆయ‌న సున్నిత‌మైన, హృద్య‌మైన క‌థ‌ల‌తోనే సినిమాలు తీశాడు. కెరీర్లో కొన్నిసార్లు స్టార్ల‌తో సినిమాల కోసం ప్ర‌య‌త్నించి చూసినా వ‌ర్క‌వుట్ కాలేదు. ఐతే ఎట్ట‌కేల‌కు కొన్ని నెల‌ల ముందే ఆయ‌న స్టార్ సినిమాకు రెడీ అయ్యారు. అందులో ఒక‌రు కాదు.. ఇద్ద‌రు స్టార్లు న‌టిస్తుండ‌టం విశేషం. వాళ్లే.. ధ‌నుష్‌, నాగార్జున‌. ఐతే నాగ్‌ది ఇందులో ప్ర‌త్యేక పాత్రే. హీరో మాత్రం ధ‌నుషే.

ఈ త‌మిళ స్టార్ హీరోతో క‌మ్ముల ఓ మాఫియా క‌థ‌ను తెర‌కెక్కిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. క‌మ్ముల ఏంటి మాఫియా సినిమా ఏంటి అని ఆశ్చ‌ర్యం క‌లిగినా.. త‌ర్వాత అంద‌రూ దానికి ప్రిపేరై ఉన్నారు. కానీ ఈ రోజు రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో అంద‌రికీ పెద్ద షాకే త‌గిలింది.

ధ‌నుష్‌తో క‌మ్ముల తీస్తున్న‌ది మాఫియా క‌థ కాద‌ని.. ఇది ధ‌నుష్ మార్కు సినిమా అని ఫ‌స్ట్ లుక్ చూస్తే అర్థ‌మైంది. కుబేర అనే టైటిల్ పెట్టుకుని బికారి వేషంలో క‌నిపించాడు ధ‌నుష్‌. త‌మిళంలో ధ‌నుష్ అణ‌గారిన వ‌ర్గాల‌కు చెందిన‌.. అన్యాయానికి గురైన‌.. అనాకారీలా క‌నిపించే పాత్ర‌లు చాలానే చేశాడు. మొద‌ట్లో అత‌డికి ఆ పాత్ర‌లు కొత్త‌గా క‌నిపించేవి. రాను రాను అవే పాత్ర‌లు చేస్తుండ‌టంతో త‌మిళ జ‌నాల‌కు కూడా మొహం మొత్తేసింది. అందుకే తెలుగులో అత‌ను చేసిన సార్ కొంచెం భిన్నంగా క‌నిపించింది.

ఐతే క‌మ్ముల ఇప్పుడు త‌న మార్కును వ‌దిలేసి ధ‌నుష్ పాత స్ట‌యిల్లోనే సినిమా తీస్తున్న‌ట్లు అనిపిస్తోంది. ఫ‌స్ట్ లుక్ చూస్తే క‌మ్ముల ముద్రంటూ ఏమీ క‌నిపించ‌లేదు. అత‌ను త‌న కంఫ‌ర్ట్ జోన్ నుంచి బ‌య‌టికి వ‌చ్చి ధ‌నుష్‌కు సూట‌య్యే క‌థ‌నే చేస్తున్న‌ట్లు అనిపిస్తోంది. ఫ‌స్ట్ లుక్ చూస్తే బిచ్చ‌గాడు మూవీతో పోలిక‌లు కూడా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.