ఇడ్లీ వడ వివాదంలో కొత్త కోణాలు

ఇటీవలే జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రామ్ చరణ్ ని స్టేజి మీదకు ఆహ్వానించిన షారుఖ్ ఖాన్ ఆ తర్వాత ఇద్దరు కలిసి అమీర్, సల్మాన్ లతో నాటు నాటు పాటకు కలిసి డాన్స్ చేసిన వీడియో ఎంత వైరలయ్యిందో చూశాం. అయితే మెగా పవర్ స్టార్ ని పైకి పిలిచే సందర్భంలో షారుఖ్ అభ్యంతరకర రీతిలో భేన్డ్, ఇడ్లీ, వడ పదాలతో సంబోదించాడని, ఇది చాలా బాధ కలిగించిందని ఉపాసన పర్సనల్ మేకప్ విమెన్ జేబా హసన్ తన ఇన్స్ టా వేదికగా పెట్టిన పోస్ట్ విపరీతమైన చర్చకు దారి తీస్తోంది. నిన్న మధ్యాన్నం మొదలు ఈ టాపిక్ మీద పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతున్నాయి.

నిజానికి ఆ వీడియోలో షారుఖ్ అన్న పదాలు పూర్తి స్పష్టంగా లేవు. ఫోన్ కెమెరాలో షూట్ చేసింది కావడంతో అంత గోలలో రికార్డింగ్ సరిగా జరగలేదు. ఇడ్లీ వడని వినిపిస్తోంది కానీ కాంటెక్స్ట్ అర్థం కాలేదు. ఉద్దేశం ఏదైనా ఇలా అనడం మాత్రం ముమ్మాటికీ తప్పేనని అభిమానుల కామెంట్. రివర్స్ లో మేం కూడా వడా పావ్, పావ్ భాజీ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోమని కౌంటర్లు ఇస్తున్నారు. అయితే షారుఖ్ తరఫున వాదిస్తున్న వాళ్ళ వెర్షన్ ఇంకోలా ఉంది . వన్ టు కా ఫోర్ (2001) అనే సినిమాలో షారుఖ్ సౌత్ గురించి మాట్లాడుతూ ఇడ్లీ, వడ, రజని, కమల్, వెంకీ, నాగ్ అంటూ ఒక డైలాగు చెబుతాడు.

అంటే ఇవన్నీ దక్షిణాదిలో అంత ఫేమస్ అనే ఉద్దేశంతో. ఆ సీన్ తాలూకు క్లిప్పింగ్ కూడా బయటికి తీశారు. ఆ కోణంలోనే ఇప్పుడు కూడా వాటి ప్రస్తావన తెచ్చాడు తప్పించి కావాలని రామ్ చరణ్ ని ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో కాదని బాద్షా ఫ్యాన్స్ సమాధానం. ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెడితే సరదా కోసమైనా సరే షారుఖ్ అంత పెద్ద వేదికపై ఆలా అనకుండా ఉండాల్సిందనేది ఎవరూ కాదనలేని స్టేట్ మెంట్. లక్షలాది కెమెరాలు చూస్తున్నప్పుడు మాట, ఆట రెండూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలా లేనిపోని కాంట్రావర్సీలకు దారి తీసి విభేదాలు తెస్తాయి.