బాక్సాఫీస్‌ జోష్.. ఇంకెప్పుడో?

సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పెద్దగా సందడే లేదు. సంక్రాంతి తర్వాతి రెండు వారాల్లో తెలుగు నుంచి అసలు కొత్త రిలీజ్‌లు అన్నవే లేవు. ఇక ఫిబ్రవరిలో ఈగల్ లాంటి పెద్ద సినిమాతో పాటు ఊరు పేరు భైరవకోన, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు లాంటి చిత్రాలు కొంతమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షఇంచాయి. కానీ అవేవీ కూడా ఆశించిన ఫలితాలు అందుకోలేదు.

బాక్సాఫీస్ రాను రాను డల్ అయిందే తప్ప.. జోష్ కనిపించలేదు. ప్రేక్షకుల్లో కొత్త సినిమాల పట్ల ఆసక్తే కనిపించలేదు. థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. మార్చి నెలలో అయినా కథ మారుతుందనుకుంటే.. అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. కొత్త సినిమాల టాక్ సంగతి పక్కన పెడితే.. ఉదయం ఏ చిత్రమూ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో థియేటర్లకు రప్పించలేకపోయింది.

వరుణ్ తేజ్ సినిమా అంటే ఒకప్పుడు తొలి రోజు థియేటర్లు బాగా నిండేవి. ఫిదా, తొలి ప్రేమ లాంటి చిత్రాలు వీకెండ్లో హౌస్ ఫుల్స్‌తో రన్ అయ్యాయి. కానీ గని, గాండీవధారి అర్జున లాంటి పరాజయాల తర్వాత వరుణ్‌ను జనాలు లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ముందు నుంచి పెద్దగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయిన వరుణ్ కొత్త చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ తొలి రోజు ఉదయం సరైన ఆక్యుపెన్సీలు లేక ఇబ్బంది పడింది. తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్‌గా 20 శాతం లోపే ఆక్యుపెన్సీ నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ వల్ల సినిమాకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. టాక్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వీకెండ్లో కూడా సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.

ఇక వెన్నెల కిషోర్ హీరోగా నటించిన ‘చారి 111’, శివ కందుకూరి లీడ్ రోల్ చేసిన ‘భూతద్దం భాస్కర నారాయణ’ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. జనాలు లేక షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితి తలెత్తింది వీటికి. టాక్ పరంగా అన్నింట్లోకి ‘భూతద్దం..’ బెటర్ అంటున్నారు కానీ.. శివకు హీరోగా గుర్తింపు లేకపోవడం వల్ల ఆ సినిమా చూసేందుకు జనాలు థియేటర్లకు రావట్లేదు.