ఇటీవలే మలయాళంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రేమలుని అదే టైటిల్ తో తెలుగులో ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా డబ్బింగ్ రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తొలుత రీమేక్ ప్రతిపాదన జరిగింది కానీ ఫైనల్ గా ఒరిజినల్ ఫీల్ రావాలంటే అనువాదమే బెస్టని భావించి ఫైనల్ గా దానికే ఫిక్స్ అయ్యారు. గిరీష్ ఏడి దర్శకత్వం వహించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఒరిజినల్ వెర్షన్ హైదరాబాద్ లో రోజుల తరబడి హౌస్ ఫుల్స్ తో నడిచింది. అలాంటిది ఇప్పుడు తెలుగులోనే వస్తుందంటే క్రేజ్ రాకుండా ఎలా ఉంటుంది. ఆ నమ్మకం టీమ్ లో బలంగా కనిపిస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్నున్నాయి. మొదటిది ప్రేమలు తెలుగు టీమ్ ప్రస్తుత ట్రెండ్ ని బాగా ఫాలో అయ్యారు. ఇటీవలే సోషల్ మీడియాని ఊపేసిన కుమారి ఆంటీ రెఫరెన్సుని వాడుకోవడం, తొక్కుంటూ పోవాలే అంటూ ఆర్ఆర్ఆర్ లో డైలాగుని హీరోతో చెప్పించడం వగైరాలన్నీ వైరలైన టాపిక్సే. 90స్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తో ఈటీవీ విన్ కో భారీ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు ఆదిత్య హాసన్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి సంభాషణలు రాయించడం యూత్ పల్స్ ని పర్ఫెక్ట్ గా పట్టుకోవాలనే ఉద్దేశమే. తక్కువ టైంలో ప్లాన్ ప్రకారం చేశారివన్నీ.
మార్చి 8 విడుదల కాబోతున్న ప్రేమలుకి కాంపిటీషన్ లేకపోలేదు. విశ్వక్ సేన్ గామి, గోపీచంద్ భీమాలను కాచుకోవడం అంత సులభం కాదు. కాకపోతే వాటితో పోల్చుకుంటే ప్రేమలుకు పెట్టిన ఖర్చు చాలా తక్కువ. డీసెంట్ టాక్ వచ్చినా చాలు తక్కువ స్క్రీన్లు అయినా సరే ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ట్రైలర్ చూస్తుంటే యువతని ఆకట్టుకునేలా కట్ చేశారు. ముఖ్యంగా హీరో పాత్ర, హీరోయిన్ నటన ఓసారి చూద్దామనిపించేలా ఉన్నాయి. ఇది వచ్చిన వారానికే మరో మల్లువుడ్ బ్లాక్ బస్టర్ మెంజుమ్మెల్ బాయ్స్ కూడా డబ్బింగ్ రూపంలో రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.