సైంధ‌వ్ ఎఫెక్ట్ ప‌డిందిగా..

ఒక్క సినిమా ఫ‌లితంతో క‌థ మొత్తం మారిపోతుంటుంది ఒక్కోసారి. అది హిట్ట‌యినా స‌రే… ఫ్లాపైనా స‌రే. హిట్ సిరీస్ చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు సంపాదించిన యువ ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ప‌రిస్థితి ఇప్పుడు ఇలాగే త‌యారైన‌ట్లు స‌మాచారం. హిట్, హిట్-2 ఒక‌దాన్ని మించి ఒక‌టి హిట్ట‌వ‌డంతో శైలేష్‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది.

విక్ట‌రీ వెంక‌టేష్ లాంటి పెద్ద హీరో త‌న కెరీర్లో మైలురాయి అయిన 75వ చిత్రాన్ని శైలేష్‌తో ప్లాన్ చేసుకున్నాడు. మొద‌లైన‌పుడు ఈ సినిమా స్యూర్ షాట్ హిట్ అనే ఫీలింగ్ క‌లిగింది. టైటిల్ టీజ‌ర్ అంత ఎఫెక్టివ్‌గా క‌నిపించింది. కానీ చివ‌రికి సినిమా చూస్తే తుస్సుమ‌నిపించింది. సంక్రాంతికి రిలీజైన సైంధ‌వ్ మినిమం ఇంపాక్ట్ చూపించ‌కుండా వెళ్లిపోయింది.

సైంధ‌వ్ బాగా ఆడేస్తుంద‌ని.. దీనికి కొన‌సాగింపుగా ఇంకో సినిమా కూడా తీయాల‌ని ప్లాన్ చేసుకున్నాడు శైలేష్‌. కానీ ఆ సినిమా పోవ‌డంతో సీక్వెల్ వ‌చ్చే ఛాన్సే లేకుండా పోయింది. ఇక అత‌ను హిట్ ఫ్రాంఛైజీలో మూడో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. హిట్, హిట్-2 చిత్రాల‌ను నిర్మించిన నానినే ఈసారి హీరోగా న‌టించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా స్క్రిప్టు విష‌యంలో నాని అంత సంతృప్తిగా లేడ‌ట‌. ఇటీవ‌ల న‌రేష‌న్ విని అంత ఎఫెక్టివ్‌గా లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడ‌ట‌. మార్పులు చేర్పులు చేసుకురావాల‌ని సూచించ‌డంతో శైలేష్ మ‌ళ్లీ ఆ ప‌నిలో ప‌డ్డ‌ట్లు స‌మాచారం.

సైంధ‌వ్ హిట్ అయి ఉంటే.. నాని పెద్ద‌గా ఆలోచించ‌కుండా హిట్‌-3ని ప‌ట్టాలెక్కించేసి ఉంటాడు. కానీ అది తేడా కొట్ట‌డంతో శైలేష్ టాలెంట్ మీద సందేహాలు ఏర్ప‌డి ఉంటాయి. ఇంకొంచెం జాగ్ర‌త్త అవ‌స‌ర‌మ‌ని భావించి ఉంటాడు.