ఊహకందని ప్రపంచంలో ‘గామి’ రహస్యం

విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన గామి ఆరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉంటూ చాలా మంది ప్రేక్షకులకు తెలియకుండా షూటింగ్ జరుపుకుంది. ఫైనల్ గా మార్చి 8 విడుదలకు రంగం సిద్ధం చేసుకుని థియేటర్లో అడుగు పెట్టనుంది. హైదరాబాద్ పీసీఎక్స్ స్క్రీన్ మీద ప్రత్యేకంగా లాంచ్ చేసిన ట్రైలర్ లాంచ్ కి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరవ్వగా, వీడియో రూపంలో ప్రభాస్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం స్పెషల్ సర్ప్రైజ్ గా నిలిచింది. కమర్షియల్ హంగులకు దూరంగా చాలా అరుదుగా దక్కే అనుభూతిని గామి ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు విద్యాధర్ కగిత.

శంకర్(విశ్వక్ సేన్)కో అరుదైన వ్యాధి ఉంటుంది. మనిషిని తాకకూడదు. ఎవరో పడే బాధని తన శరీరం తీసుకుని విచిత్రమైన వర్ణంలోకి మారుతూ ఉంటుంది. దీని పరిష్కారం మూడు దశాబ్దాలకోసారి హిమాలయాల్లో దొరికే అరుదైన మూలికలో ఉందని తెలుసుకుని అక్కడికి బయలుదేరతాడు. తోడుగా ఒక గైడ్(చాందిని చౌదరి)అతని వెంటే వెళ్తుంది. అయితే గామి లక్ష్యానికి, మారుమూల పల్లెటూర్లో ఉండే ఒక దేవదాసి(అభిరామి)కి సంబంధం ఉంటుంది. ఇంతకీ శంకర్ కు వచ్చిన రుగ్మత ఏమిటి, పురాణాలూ తాళపత్రాలతో ముడిపడిన పద్మవ్యూహం నుంచి ఎలా బయటపడ్డాడనేదే కథ.

మూడున్నర నిమిషాలకు దగ్గరగా కట్ చేసిన ట్రైలర్ ని ఆద్యంతం టెర్రిఫిక్ విజువల్స్ తో నింపేశారు. లొకేషన్లు, విఎఫెక్స్, ఘాడత నిండిన సన్నివేశాలు, పాత్రల మధ్య సంబంధాలు ఇలా ఎన్నో అంశాలను మేళవించి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే దిశగా విద్యాధర్ చూపించిన పనితనం అబ్బురపరిచేలా ఉంది. విశ్వనాథ్ ఛాయాగ్రహణం, నరేష్ కుమరన్ నేపధ్య సంగీతం రెండూ పోటీ పడ్డాయి. విశ్వక్ సేన్ లుక్స్ డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. అఘోరాగా తనలో కొత్త షేడ్ ని పరిచయం చేయబోతున్నాడు. రేపిన అంచనాలకు తగ్గట్టు గామి అద్భుతం చేస్తాడా అనేది తెలియాలంటే ఇంకో వారం ఆగాలి.