నిన్న జరిగిన టీడీపీ జనసేన సంయుక్త జెండా సభ ఎన్నికలకు సంబంధించినదే అయినా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ప్రత్యేకంగా కొన్ని సినిమా ముచ్చట్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని వివరించే క్రమంలో అవి అధ్వాన్నంగా ఉండటం వల్లే ఓజికు తీసుకున్న పారితోషికాన్ని ఇలా అద్దె హెలికాఫ్టర్లకు వాడాల్సి వచ్చిందని, లేదంటే చక్కగా రహదారిలోనే వచ్చేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. పవన్ ప్రస్తుతం మూడు షూటింగుల్లో ఉన్నారు. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు. సమాంతరంగా జరగకపోయినా అన్నీ సెట్స్ మీదున్నవే.
అయితే అన్నింటికన్నా ఆలస్యంగా మొదలైన ఓజి మీద పవన్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ చూస్తే దర్శకుడు సుజిత్ ఏం మేజిక్ చేశాడోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇతని కన్నా వేగంగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే అవకాశం ఉందని తెలిసినా కూడా పవన్ సుజిత్ వైపే మొగ్గు చూపాడు. ఎలక్షన్లు కాగానే కాల్ షీట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ మేరకు సెప్టెంబర్ 27 విడుదలను నిర్మాత అధికారికంగా ప్రకటించాడు. మిగిలిన వాటి సంగతేమో కానీ ఓజి పట్ల అభిమానులకు ఎంత నమ్మకం ఉందో అంతకన్నా ఎక్కువే పవన్ చూపిస్తున్న వైనం తేటతెల్లమవుతోంది.
దీని సంగతి పక్కనపెడితే భీమ్లా నాయక్ టైంలో రెవిన్యూ అధికారులను పెట్టి టికెట్లు అమ్మించిన ఉదంతాలను పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతే కాదు ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వీళ్లందరి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నానని ప్రస్తావించడం మరో ముఖ్యమైన అంశం. చాలా వాడివేడిగా జగన్ ప్రభుత్వంపై మాటల దాడితో విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ అంత తీవ్రతలోనూ సినిమాలు, ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాట్లాడ్డం విశేషం. అన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates