ప్రశాంత్ నీల్ ఆల్ టైం ఫేవరెట్ డైరెక్టర్?

ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే రాజమౌళి తర్వాతి స్థానం ప్రశాంత్‌దే. ‘కేజీఎఫ్’ అనే ఒకే ఒక్క సినిమాతో అతడి రేంజే మారిపోయింది. ‘సలార్’ సైతం పెద్ద సక్సెస్ కావడంతో ప్రశాంత్ ఇమేజ్ ఇంకా పెరిగింది. అతను తర్వాత తీయబోయే సినిమాల మీద భారీ అంచనాలున్నాయి.

రాజమౌళి తర్వాత వెయ్యి కోట్ల బిజినెస్ చేసే స్థాయి ఉన్న దర్శకుడు ప్రశాంతే. కన్నడ సినిమా స్థాయిని ఎంతగానో పెంచి.. ఆ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తున్న ప్రశాంత్‌కు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అతణ్ని అందరికంటే ఎక్కువ‌గా ఇన్‌స్పైర్ చేసింది ఎవరు? ఈ ప్రశ్నలకు ఓ ఇంటర్వ్యూలో అతను సమాధానం ఇచ్చాడు. అతను చెప్పిన పేరు.. ‘ఉపేంద్ర’ కావడం విశేషం.

ఓ కన్నడ సినీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. “నేను కన్నడ కార్యక్రమంలో ఉన్నా కాబట్టి ఈ మాట చెప్పట్లేదు. నాకు నచ్చిన దర్శకుడు ఉపేంద్ర. ఆయనలా సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. కథ చెప్పే విధానంలో, వాటిని తెరపైన ఆవిష్కరించే తీరులో ఉపేంద్ర చాలా వైవిధ్యం చూపిస్తాడు. ఏ, ఓం, ష్, ఉపేంద్ర లాంటి సినిమాలు చూస్తే.. సినిమాలు ఇలా తీసి కూడా హిట్టు కొట్టొచ్చా అనిపిస్తుంది. ఆయన స్టైలే వేరు” అని ప్రశాంత్ అన్నాడు.

ప్రశాాంత్ మాటల్లో అతిశయోక్తి ఏమీ కనిపించదు. ఇప్పుడు అందరూ సినిమాల్లో కొత్తదనం గురించి మాట్లాడుకుంటున్నారు కానీ.. 90వ దశకంలోనే ఎ, రా, ఉపేంద్ర లాంటి సినిమాలతో సంచలనం రేపాడు ఉప్పి. తెలుగులోనూ ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఉప్పి స్వీయ దర్శకత్వలో ‘యు’ అనే వెరైటీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.