ఈపాటికి ‘దేవర’ సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ నడుస్తుండాలి. ముందు ప్రకటించినట్లే ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీం శతవిధాలా ప్రయత్నించింది కానీ.. ఈ చిత్రంలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ సందర్భంగా గాయపడి ఆసుపత్రి పాలవడంతో షెడ్యూళ్లన్నీ తలకిందులయ్యాయి. ఆయన నెల రోజులకు పైగా షూటింగ్‌కు వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ సహా అందరు ఆర్టిస్టుల డేట్లూ వృథా అయ్యాయి.
మళ్లీ అందరినీ ఒక చోటికి చేర్చి కాంబినేషన్ సీన్లు తీయాలంటే ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. అందుకే సినిమాను అనుకున్న దాని కంటే చాలా ఎక్కువ రోజులు వెనక్కి తీసుకెళ్లారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 10న రిలీజ్ చేయడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. సైఫ్ అందుబాటులో లేకుండా పోయాక పెద్దగా షూటింగ్ చేయలేదు దేవర టీం.
ఐతే సైఫ్ వేగంగా కోలుకుంటున్న సైఫ్ త్వరలోనే ‘దేవర’ కోసం అందుబాటులోకి రానున్నాడు. మార్చి రెండో వారంలో ఆయన షూటింగ్‌కు హాజరవుతాడని తాజా సమాచారం. ప్రస్తుతం ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్న సైఫ్.. త్వరలోనే పూర్తి ఫిట్‌గా తయారవుతాడట. ఆయన కాంబినేషన్లో మేజర్ సీక్వెన్సులు తీయడానికి టీం షెడ్యూళ్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మే-జూన్ మధ్య ‘దేవర’ చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు భారీగానే చేయాల్సి ఉండడం.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేయడంతో ఏ హడావుడి లేకుండా అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని అక్టోబర్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘దేవర’ను రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆయన మిత్రుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి తారక్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.