వ‌రుణ్ తేజ్ కమిట్మెంట్‌కైనా హిట్టు ప‌డాలి

టాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కెరీర్ ఇప్పుడు డోలాయ‌మాన స్థితిలో ఉంది. ఫిదా, తొలి ప్రేమ‌, ఎఫ్‌-2 లాంటి హిట్ల‌తో ఒక‌ప్పుడు అత‌ను మంచి ఊపులోనే ఉన్నాడు. కానీ త‌ర్వాత స‌రైన సినిమాలు ఎంచుకోక గాడి త‌ప్పాడు. గ‌ని, గాండీవ‌ధారి అర్జున సినిమాలు అతణ్ని బాగా కిందికి లాగేశాయి. మ‌ధ్య‌లో ఎఫ్‌-3 సైతం స‌రిగా ఆడ‌లేదు. ఇప్పుడు వ‌రుణ్ ఆశ‌ల‌న్నీ ఆప‌రేష‌న్ వేలంటైన్ మీదే ఉన్నాయి.

వ‌రుణ్ న‌టించిన తొలి బైలింగ్వ‌ల్ మూవీ ఇది. తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి చిత్రీక‌రించారు. శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ద‌ర్శ‌కుడు. సోనీ పిక్చ‌ర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ పెద్ద బ‌డ్జెట్లో ఈ సినిమాను నిర్మించింది. ఐతే వ‌రుణ్ ట్రాక్ రికార్డు దెబ్బ తిన‌డం, బాలీవుడ్ మూవీ ఫైట‌ర్‌తో పోలికల‌ వ‌ల్ల దీనికి ఆశించిన స్థాయిలో బ‌జ్ క‌నిపించ‌లేదు మొన్న‌టిదాకా. కానీ రిలీజ్ టైం ద‌గ్గ‌ర ప‌డేస‌రికి ప‌రిస్థితి మెరుగుప‌డుతోంది.

ఈ సినిమా కోసం వ‌రుణ్ తేజ్ ప‌డ్డ‌, ప‌డుతున్న క‌ష్టం గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో లీడ్ రోల్ కోసం వ‌రుణ్ ఎయిర్ పైల‌ట్స్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకుని ఆ పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా ఆహార్యం కూడా మార్చుకున్నాడు. సినిమా కోసం రాజీ లేకుండా క‌ష్ట‌ప‌డ‌డ‌మే కాదు.. దీని ప్ర‌మోష‌న్ల కోసం చాలా ముందు నుంచే రంగంలోకి దిగాడు. విడుద‌ల‌కుకొన్ని వారాల ముందు నుంచే ప‌లు చోట్ల ఈవెంట్ల‌లో పాల్గొన్నాడు. అలాగే ఎన్నో మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. టీవీ ఛానెళ్ల‌లో, యూట్యూబ్ ఛానెళ్ల‌లో కూర్చున్నాడు. ఇలా ఒక హీరోగా సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తూ వ‌స్తున్నాడు.

ఆదివారం చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా వ‌రుణ్ ఎంతో నిజాయితీగా మాట్లాడాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలా క‌నిపిస్తున్న ఆప‌రేష‌న్ వాలెంటైన్‌ను ప్రేక్ష‌కుల‌కు చేరువ చేయ‌డానికి వ‌రుణ్ ప‌డ్డ క‌ష్టం ప్ర‌శంస‌నీయం. అత‌డి క‌మిట్మెంట్, క‌ష్టానికైనా ఈ సినిమా బాగా ఆడాల‌ని సినీ ప్రియులు అభిల‌షిస్తున్నారు.