కొత్త ఏడాదిలో సంక్రాంతి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్‌లో ఆశించిన సందడి లేదు. ఫిబ్రవరి సినిమాల్లో ఏదీ పూర్తి సంతృప్తినివ్వలేదు. అంబాజీపేట మ్యారేజీబ్యాండు, ఈగల్, ఊరు పేరు భైరవకోన అంచనాలను అందుకోలేకపోయాయి. ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయాయి. మిగతా సినిమాల గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇక ఫోకస్ మార్చి నెల పైకి మళ్లబోతోంది. ఆ నెలలో క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఓ మూడు చిత్రాలు వాటి హీరోల కెరీర్లకు అత్యంత కీలకం కాబోతున్నాయి. మేక్ ఆర్ బ్రేక్ అన్నట్లుగా ఉంది ఆ హీరోల పరిస్థితి. ముగ్గురు పేరున్న హీరోలు కమ్ బ్యాక్ ఆశిస్తున్న ఆ చిత్రాలే.. ఆపరేషన్ వాలెంటైన్, భీమ, ఆ ఒక్కటీ అడక్కు. వరుణ్ తేజ్, గోపీచంద్, అల్లరి నరేష్‌ల కెరీర్లకు ఈ చిత్రాలు ఎంతో కీలకం. ఇవి అటు ఇటు అయితే వారి కెరీర్‌కు చాలా ఇబ్బందిగా మారుతుంది.
ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి సూపర్ హిట్లతో ఒక టైంలో మంచి ఊపు మీద కనిపించాడు వరుణ్ తేజ్. కానీ రెండేళ్లుగా అతడికి ఏదీ కలిసి రావడం లేదు. గని, ఎఫ్-3, గాండీవధారి అర్జున.. ఇలా వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్’ హిట్ కావడం అతడికి చాలా అవసరం. వరుణ్ తొలిసారి హిందీలోనూ నటించిన చిత్రమిది. విడుదలకు ముందు ఈ సినిమాకు హైప్ తక్కువే ఉ:ది. కానీ కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్న వరుణ్.. ఈ చిత్రం తనకు సక్సెస్ అందిస్తుందని ఆశిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
తర్వాతి వారం రిలీజయ్యే ‘భీమ’ గోపీచంద్‌కు ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది గోపీ నుంచి వచ్చిన ‘రామబాణం’ పెద్ద డిజాస్టర్ అయింది. ఈసారి అతను కన్నడ దర్శకుడు హర్షతో జట్టు కట్టాడు ‘భీష్మ’ కోసం. గోపీ మార్కు పక్కా మాస్ మూవీలా కనిపిస్తున్న ‘భీమ’ ఏమవుతుందో చూడాలి.
ఇక ఒకప్పుడు కామెడీ చిత్రాలతో కడుపుబ్బ నవ్వించి, ఆ తర్వాత ఆ సినిమాలే కలిసి రాక సైడ్ అయిపోయాడు అల్లరి నరేష్. కొంచెం గ్యాప్ తర్వాత అతను ‘నాంది’ అనే సీరియస్ సినిమాతో హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత అదే శైలిలో చేసిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం ఆడలేదు. దీంతో మళ్లీ పాత స్టయిల్లో ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే కామెడీ సినిమా చేశాడు. దీంతో మళ్లీ తనకు కామెడీ ఇమేజ్ తిరిగొస్తుందని.. తనకు పూర్వ వైభవం తెస్తుందని ఆశిస్తున్నాడు నరేష్. మరి అతడికి కూడా మార్చి నెల మంచి కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.