నాలుగు వందలకు పైగా సినిమాలతో కేరళలో తిరుగు లేని స్టార్ డం స్వంతం చేసుకున్న మమ్ముట్టిని మలయాళం మెగాస్టారని ఊరికే అనరు. ఏడు పదుల వయసు దాటినా విశ్రాంతి ప్రసక్తే లేకుండా ఏడాదికి ఇప్పటికీ కనీసం మూడు రిలీజులు ఉండేలా చూసుకుంటున్న ఈ సీనియర్ స్టార్ పాత్రల పరంగా చేసే రిస్కులు మాములుగా ఉండవు. తాజాగా విడుదలైన భ్రమ యుగంలో షాకింగ్ క్యారెక్టర్ తో ఆడియన్స్ ని విభ్రాంతికి గురి చేశారు. క్రూరమైన హావభావాలు డిమాండ్ చేస్తూ ఒంటి మీద సగం ఆచ్చాదనతో రెండున్నర గంటలు ఒకే క్యాస్టూమ్ కి ఒప్పుకోవడమంటే మాటలు కాదు.
దాన్ని అలవోకగా చేశారు మమ్ముట్టి. ముఖ్యంగా క్లైమాక్స్ లో తన నిజ స్వరూపం బయట పడే ఎపిసోడ్లో ఆయన ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు ఒక రిఫరెన్స్ లాంటివి. గత ఏడాది కథల్ ది కోర్ లో స్వలింగ సంపర్కుడిగా నటించి భేష్ అనిపించుకున్న మమ్ముట్టి ఇంత తక్కువ గ్యాప్ లో భ్రమ యుగం రూపంలో మరో షాక్ ఇవ్వడం గమనార్హం. మూడు నాలుగు దశాబ్దాలు టాలీవుడ్ అనుభవం ఉన్న కొందరు హీరోలే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేని స్థితిలో ఉండగా మమ్ముట్టి భ్రమ యుగంలో క్లిష్టమైన తెలుగు పదాలను నేర్చుకుని మరీ స్వంతంగా గొంతు వినిపించడం విశేషం. యాత్ర 2లోనూ ఇలాగే చేశారు.
ఇలాంటి కమిట్ మెంట్ వల్లే మమ్ముట్టి ఇంత యాక్టివ్ గా ఉండటానికి కారణమేమో. మన దగ్గర చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రజులు లేట్ ఏజులోనూ హుషారుగా సినిమాలు చేస్తున్నారు కానీ ప్రయోగాలకు మాత్రం దూరమే. ఎందుకంటే మాస్ వర్గాల్లో బలమైన స్టార్ పవర్ ని సృష్టించుకున్న వీళ్ళు మమ్ముట్టి తరహాలో ఎక్స్ పరిమెంట్లు చేస్తే నిర్మాతలు నష్టపోతారు. కథల్ ది కోర్, భ్రమ యుగం లాంటి వాటిలో కనీసం ఊహించుకోవడం కూడా కష్టమే. దానికి తోడు రాష్ట్రాల వారిగా ఆడియన్స్ అభిరుచుల్లో ఉన్న తేడా కారణంగా కూడా తెలుగులో అలాంటివివి ఆశించలేం. డబ్బింగులతో సర్దుకోవడమే.