ఇండస్ట్రీలో లోగుట్లు, గొడవలు ఎన్నో ఉంటాయి కానీ వాటిని బయట పెట్టుకునే సందర్భాలు తక్కువే. ఎందుకొచ్చిన తలనొప్పిలెమ్మని లోలోపల సర్దుకునే వాళ్లే ఎక్కువ. అలాంటిది ఒక డెబ్యూ డైరెక్టర్ పేరున్న సంగీత దర్శకుడి మీద ఓపెన్ గా నెగటివ్ కామెంట్స్ చేయడం అనూహ్యమే. రేపు విడుదల కాబోతున్న సిద్దార్థ్ రాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. కిరణ్ అబ్బవరం ముఖ్య అతిథిగా పలు ప్రముఖులు హాజరు కాగా సినిమాకు సంబంధించిన కబుర్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ రాయ్ తో పరిచయమవుతున్న దర్శకుడు యశస్వి ఓపెనయ్యారు.
ఈ మూవీ ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు రదన్ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చెన్నైలో ఉంటాడు కాబట్టి సరిపోయింది కానీ, హైదరాబాద్ అయితే గొడవలు జరిగేవని నేరుగా చెప్పడం అక్కడికొచ్చిన వాళ్ళను షాక్ కి గురి చేసింది. నాలాగా ఎవరూ మోసపోకూడదని, అతనిలో ఎంత టాలెంట్ ఉన్నా, గొప్ప టెక్నీషియన్ అయినా ఇంతగా వేధించడం సరికాదని చెప్పుకొచ్చాడు. ఓసారి ఆర్గుమెంట్లు ఎలా ఉండేవంటే రాజమండ్రి నుంచి వైజాగ్ దాకా కారు ప్రయాణంలో వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నామని అంతగా ఇబ్బంది పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, పాగల్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కి పాటలు ఇచ్చిన రదన్ మీద ఇంతటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి. సున్నితమైన కథలకు మంచి ట్యూన్స్ ఇస్తాడని ఇతగాడికి పేరుంది. యశస్వి చెబుతున్న వెర్షన్ అతనితో పని చేయించుకోవడానికి భయపెట్టేలా ఉంది. అయినా రదన్ ఎదిగే స్టేజిలోనే ఉన్నాడు. ఇంకా ఏఆర్ రెహమాన్, ఇళయరాజా రేంజ్ కు చేరుకోలేదు. వాళ్లే పని విషయంలో ఇప్పటికీ అదే కమిట్ మెంట్ తో ఉన్నప్పుడు కొత్త ప్రతిభ ఇలా చేయడం విచారకరం. రదన్ ఏమని స్పందిస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates