దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకునే సూత్రం పాటిస్తారు టాలీవుడ్ యూత్ హీరోలు. కానీ నవీన్ పోలిశెట్టి దానికి భిన్నం. తొందరపడి సినిమాలు చేయకుండా కథ నచ్చి దర్శకుడు కన్విన్స్ చేస్తే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వడు. ఆ కారణంగానే జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత క్యూ కట్టిన ఎన్నో అవకాశాలను వదులుకున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో వయసులో పెద్దయిన అనుష్కతో నటించేందుకు ఎస్ చెప్పి రిస్క్ తీసుకుని గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. మరో సక్సెస్ జేబులో వేసుకున్నాడు. దీని తర్వాత ఎవరి కాంబో అనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు.
అంతకు ముందే సితార బ్యానర్ లో అనగనగా ఒక రాజుని ప్రకటించి కొంత భాగం షూటింగ్ చేశాక ఆపేశారు. దర్శకుడి మార్పనే ప్రచారం జరిగింది కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. దీని సంగతలా ఉంచితే బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న రామాయణం క్యాస్టింగ్ గురించి ఎన్ని లీకులు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. రాముడిగా ఒక్క రన్బీర్ కపూర్ మాత్రమే అఫీషియల్ గా కన్ఫర్మ్ కాగా సీతగా సాయిపల్లవి చేస్తుందో లేదా ఇంకా చెప్పలేదు. హనుమంతుడిగా సన్నీ డియోల్, విభీషణుడిగా విజయ్ సేతుపతిలు ఒప్పుకున్నారట. రావణుడిగా యష్ ఇంకా పచ్చజెండా ఊపలేదు.
కీలకమైన లక్ష్మణుడి కోసం నవీన్ పోలిశెట్టిని సంప్రదించినట్టు ముంబై టాక్. దీనికో కారణం ఉంది. నితీశ్ తివారి తీసిన చిచోరేలో మనోడు మంచి పాత్ర చేశాడు. పేరు కూడా వచ్చింది. తర్వాత హిందీ ఛాన్సులు వచ్చినా టాలీవుడ్ లో కొనసాగాలనే ఉద్దేశంతో ఎస్ చెప్పలేదు. తనకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ గా నవీన్ కు నితీష్ మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అయితే ఎంటర్ టైన్మెంట్ జానర్ కు ప్రాధాన్యం ఇస్తున్న పోలిశెట్టి దీనికి ఒప్పుకుంటాడా లేదానేది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఓకే అయితే మాత్రం గొప్ప ఇతిహాస గాథలో భాగమైన అదృష్టం నవీన్ కు దక్కుతుంది.