భలే మంచి మల్టీప్లెక్సు వ్యాపారము

ఒకప్పుడు హీరోలు నటించడం ద్వారా వచ్చిన డబ్బుని ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో లేదా ఆస్తులు కూడబెట్టడంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. కొందరు థియేటర్లు కట్టుకుని వాటి నిర్వహణ ద్వారా వచ్చిన సొమ్ముని కుటుంబ వారసులకు వచ్చేలా చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రతిదీ ఖరీదైపోయింది. స్వంతంగా ఓ పది సెంట్ల చోటు కొనాలన్నా హైదరాబాద్ లాంటి నగరాల్లో కోట్లు కావాలి. భాగస్వామ్యం లేకుండా బిజినెస్ చేయడం కష్టమైపోయింది. అందుకే పార్ట్ నర్ షిప్పులు పెరుగుతున్నాయి. అలాంటిదే మల్టీప్లెక్స్ వ్యాపారం. టాలీవుడ్ లో ఈ తరహా టై అప్ లు పెరుగుతున్నాయి.

మహేష్ బాబుతో గచ్చిబౌలిలో ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంలో సూపర్ ప్లెక్స్ నిర్మించాక దానికి వచ్చిన స్పందన, రెవిన్యూ చూసి ఇతర స్టార్లు క్రమంగా ఇదే బాట పట్టడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ ఇదే సంస్థతో మెహబూబ్ నగర్ లో సముదాయం కట్టించగా అమీర్ పేట్ సత్యం థియేటర్ ని పడగొట్టి అందులో మల్టీప్లెక్స్ కట్టడం ద్వారా అల్లు అర్జున్ ఈ రంగంలో అడుగు పెట్టాడు. తాజాగా మాస్ మహారాజా రవితేజ ఇదే తరహాలో దిల్ సుఖ్ నగర్ లో ఆరు స్క్రీన్ల సముదాయాన్ని ఏషియన్ తోనే ప్లాన్ చేసుకున్నారట. అతి త్వరలో ప్రారంభమయ్యేలా పనులు జరుగుతున్నాయట.

ఒక్కటి మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. ఏడాది పొడవునా హిట్ సినిమాలు లేక ఎన్నో వారాలు డెఫిషిట్లతో నడుస్తున్న థియేటర్లు ఎక్కువైపోయాయని బయ్యర్లు వాపోతున్న టైంలో ఇలా ఇబ్బడిముబ్బడిగా మల్టీప్లెక్సులు హైదరాబాద్ లో పెరుగుతూ పోవడం గమనార్హం. ఖరీదు ఎక్కువైనా సరే సగటు మధ్య తరగతి జనాలు కూడా మంచి అనుభూతిని కోరుకుంటున్నారు. అందుకే సింగల్ స్క్రీన్ల కన్నా వీటికి డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టే ఏషియన్ లాంటి సంస్థలు పక్కా ప్రణాళికతో స్టార్ హీరోలతో చేతులు కలిపి తమ నెట్ వర్క్ ప్లస్ బిజినెస్ రెండూ పెంచేసుకుంటున్నాయి.