భారతీయుడు 2 బిజినెస్ వెనుక మతలబేంటి

లోక నాయకుడు కమల్ హాసన్ ల్యాండ్ మార్క్ మూవీ భారతీయుడు సీక్వెల్ పాతికేళ్ల తర్వాత రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నైజాం హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్మెంట్స్ తరఫున సురేష్ బాబు, సునీల్ నారంగ్ లు సంయుక్తంగా కొన్నారన్న వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంత మొత్తానికి అనేది బయటికి చెప్పలేదు కానీ క్రేజీ ఆఫరే ఇచ్చారట. లైకా ప్రొడక్షన్ల సినిమాలు అధిక శాతం దిల్ రాజు కొనేవారు. పొన్నియిన్ సెల్వన్ కూడా ఆయనదే. దానికి భిన్నంగా ఈసారి చేతులు మారిపోతున్నాయి.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు భారతీయుడు 2 అమ్మకాలు షురూ చేశారంటే విడుదల తేదీ గురించి ఒక అంచనాకు వచ్చారనే కదా అర్థం. చెన్నై టాక్ ప్రకారం దర్శకుడు శంకర్ రెండు మూడు ఆప్షన్లు పెట్టుకున్నారట. ముందు ఏప్రిల్ అనుకున్నారు కానీ చేతిలో ఉన్న అతి తక్కువ టైంలో ప్రమోషన్లకు సమయం చాలదనే ఉద్దేశంతో వద్దనుకున్నారట. ఒకవేళ కల్కి కనక మే 9 నుంచి తప్పుకుంటే ఆ డేట్ ని తీసుకునే ఆలోచనైతే సీరియస్ గానే జరుగుతోంది. పుష్ప 2 ది రూల్ ఆగస్ట్ 15 రావడం దాదాపు ఖరారే. సో గుడ్డిగా అది పోస్ట్ పోన్ అవుతుందనే నమ్మకం వృథా.

సెప్టెంబర్ చివర్లో పవన్ కళ్యాణ్ ఓజి, అక్టోబర్ రెండో వారంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర ఉన్నాయి కాబట్టి తెలుగు మార్కెట్ కోణంలో చూసుకుంటే వాటితో తలపడటం భారతీయుడు 2కి రిస్క్ అవుతుంది. సో అయితే మే లేదా ఆగస్ట్, ఈ రెండు మిస్ చేసుకునే పనైతే ఏకంగా డిసెంబర్ లేదా సంక్రాంతికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ శంకరే దర్శకత్వం వహిస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఏడాది చివర్లో క్రిస్మస్ పండగని లాక్ చేసుకునే చర్చలో ఉంది. సో ఎటూ తిరిగి భారతీయుడు 2 నవంబర్ లోపే రావాలి. ఈ సందిగ్దత అంత సులభంగా తీరేలా కనిపించడం లేదు. చూద్దాం.