బాలు తనయుడు చేసింది కరెక్టేనా?

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. గత ఏడాది తరుణ్ భాస్కర్ నుంచి వచ్చిన ‘కీడా కోలా’ సినిమాలో బాలు గాత్రాన్ని ఏఐ ద్వారా రీక్రియేట్ చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించాడు. తరుణ్ భాస్కర్ అండ్ కోకు ఆయన ఈమేరకు లీగల్ నోటీసులు పంపించారు. అనుమతి లేకుండా బాలు వాయిస్‌ను వాడుకున్నందుకు క్షమాపణ చెప్పడంతో పాటు రాయల్టీ కింద కోటి రూపాయలు చెల్లించాలని కీడా కోలా టీంకు చరణ్ లాయర్ నోటీసులు పంపించాడు.

ఐతే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనుమతి లేకుండా బాలు వాయిస్ వాడుకోవడం తప్పు కదా అని తరుణ్ భాస్కర్‌ను తప్పుబడుతుంటే.. ఇంకొందరు చరణ్ ఇంత తీవ్రంగా స్పందించాలా అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

కొన్నేళ్ల కిందట బాలు-ఇళయరాజా మధ్య నడిచిన వివాదం గుర్తుండే ఉంటుంది. సంగీత విభావరుల్లో తన పాటలు వాడుకుంటున్నందుకు రాయల్టీ ఇవ్వాలంటూ బాలుకు ఇళయరాజా నోటీసులు ఇవ్వడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇందులో బాలు ఎంతో ఆవేదన చెందారు. తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. ఆ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. ‘కీడా కోలా’ టీం బాలు మీద గౌరవంతోనే ఆయన వాయిస్‌ను ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఉండొచ్చని.. అందుకు లాయర్ నోటీసులు ఇచ్చి, కోటి రూపాయల పరిహారం కోరడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

అనుమతి లేకుండా బాలు వాయిస్ వాడుకోవడం తప్పే కావచ్చు కానీ.. దానికి వార్నింగ్‌తో సరిపెట్టాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఐతే ‘కీడా కోలా’ టీంను చూసి మిగతా వాళ్లు కూడా ఏఐ సాయంతో బాలు వాయిస్‌ను వాడుకుంటూ పోతే అది బ్యాడ్ ట్రెండుకు దారి తీస్తుందని.. ఇంకెవరూ ఇలా చేయకుండా హెచ్చరించడానికే ఎస్పీ చరణ్ నోటీసుల వరకు వెళ్లి ఉండొచ్చని.. తరుణ్ భాస్కర్ చరణ్‌తో మాట్లాడితే మొత్తం సర్దుకుంటుందని భావిస్తున్నారు.