ఎంత హీరోయిన్ అయినా సక్సెస్, అదృష్టం రెండూ కలిసి రానిదే ఇండస్ట్రీలో త్వరగా గుర్తింపు రాదు. కొన్ని సార్లు ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వస్తుంది. దిశా పటాని ఇప్పుడు ఈ స్టేజిని అనుభవిస్తోంది. కల్కి 2898 ఏడిలో దీపికా పదుకునేతో కలిసి ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ హాట్ బ్యూటీకి మంచి పాటలు పడ్డాయని ఆల్రెడీ టాక్ ఉంది. సినిమా కనక బ్లాక్ బస్టర్ అయితే టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టడం ఖాయమని అంటున్నారు. దీనికన్నా ఎక్కువగా సూర్య కంగువలో సోలో హీరోయిన్ గా ప్రాధాన్యం దక్కిందనే వార్తల నేపథ్యంలో సౌత్ లో జెండా పాతేందుకు మంచి అవకాశం దక్కుతోంది.
నిజానికి దిశా పటాని పరిశ్రమకు వచ్చింది 2015లో రిలీజైన లోఫర్ తో. వరుణ్ తేజ్ కు జోడిగా పూరి జగన్నాధ్ ఈమెను పరిచయం చేశాడు. కాకపోతే బాక్సాఫీస్ వద్ద బొమ్మ బోల్తా కొట్టడంతో మన జనాలు అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎంఎస్ ధోని చేసినా భాగీ 2 వచ్చేదాకా బ్రేక్ దక్కలేదు. అక్కడి నుంచి కూడా ఎగుడు దిగుడు ప్రయాణమే జరిగింది. హిట్ల కంటే ఎక్కువ ఫ్లాపులే పలకరించాయి. తిరిగి ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతోంది. సిద్దార్థ్ మల్హోత్రాతో చేసిన యోధ మార్చ్ 15 విడుదల కానుంది. మల్టీస్టారర్ వెల్కమ్ టు ది జంగల్ నిర్మాణంలో ఉంది.
ఈ లెక్కన పూరి జగన్నాధ్ ఎప్పుడో చెక్కిన శిల్పం ఇప్పుడు ప్రాణం పోసుకుంటోంది. అంటే తొమ్మిదేళ్ల తర్వాత సరైన అవకాశాలు వస్తున్నాయన్నా మాట. గ్లామర్ షోకు ఏ మాత్రం మొహమాటపడని దిశా పటానిని కల్కిలో మాత్రం ఎక్స్ పోజింగ్ వ్యవహారాలు గట్రా పెట్టలేదట. దర్శకుడు నాగ అశ్విన్ స్కూల్ వేరే కాబట్టి దానికి అనుగుణంగానే ఆమెను ఉపయోగించుకున్నాడు. కల్కి ప్రమోషన్లలో భాగంగా మే నుంచి ఆమె టీమ్ తో కలిసి దేశమంతటా పలు కార్యక్రమాల్లో భాగం కానుంది. విశ్వంభరకు కూడా అడిగారనే టాక్ ఉంది కానీ ఎంతమేరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది.