ఫైటర్-వాలెంటైన్.. పోలికలు కొట్టొచ్చినట్లు

మెగా కుర్రాడు వరుణ్ తేజ్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. ఆపరేషన్ వాలెంటైన్. అతడి చివరి రెండు సినిమాలు గని, గాండీవధారి అర్జున ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ఈ నేపథ్యంలో వరుణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సక్సెస్ కావడం అతడికి చాలా చాలా అవసరం. వరుణ్ తొలిసారి తెలుగుతో పాటు హిందీలోనూ నటించిన సినిమా ఇది.

శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. గత ఏడాదే విడుదల కావాల్సిన సినిమా.. అనివార్య కారణాలతో వాయిదా పడి మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే.. దీనికి బాలీవుడ్ మూవీ ‘ఫైటర్’కు పోలికలు కనిపించాయి. ఐతే అది పెద్ద సమస్య కాదన్నట్లు మాట్లాడాడు ఇటీవల వరుణ్ తేజ్. కట్ చేస్తే ఈ రోజు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్ లాంచ్ అయింది.

ట్రైలర్ చూస్తే ‘ఫైటర్’తో చాలా పోలికలు కనిపిస్తున్నాయి. రెండు చిత్రాల్లో కథ ఒకటే అనిపిస్తోంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ మీదే రెండు సినిమాలూ తెరకెక్కాయి. హీరో అందులో, ఇందులో ఫైటర్ పైలటే. ఇద్దరినీ ప్రాబ్లమాటిక్ పర్సన్స్‌గా చూపించారు. రెండు చోట్లా పుల్వామా దాడి ప్రస్తావన ఉంది. విజువల్స్ చాలా వరకు ఒకలాగే అనిపించాయి. ‘ఫైటర్’ సినిమాను భారీ బడ్జెట్లో మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో తీసినా ప్రేక్షకులకు రుచించలేదు.

‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ క్వాలిటీ కనిపిస్తోంది కానీ.. ‘ఫైటర్’ను మించి ఇందులో గ్రాండియర్ ఏం చూపిస్తారో చూడాలి. ఒక కథతో ఆల్రెడీ ఫెయిల్ ఒక సినిమా ఫెయిలయ్యాక.. ఇంకో 40 రోజులకే అలాంటి కథతోనే తెరకెక్కిన సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ప్రశ్నార్థకం. వరుణ్ తేజ్ ట్రాక్ రికార్డు దెబ్బ తినడం వల్ల తెలుగులో ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. హిందీలో అయితే ఈ సినిమాకు ఆదరణ చాలా కష్టమే అనిపిస్తోంది.