తమ్ముడిని తాకిన గేమ్ ఛేంజర్ సెగలు

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఎంత ఆలస్యమవుతుందో అభిమానుల ఫ్రస్ట్రేషన్ అంతే పైకి చేరుకుంటోంది. మూడేళ్లు దాటినా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉండటం, యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో సహజంగానే వివిధ రూపాల్లో వాళ్ళ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ లాంచ్ కు వచ్చిన తమ్ముడు వరుణ్ తేజ్ ని సైతం ఈ సెగలు తాకాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో భాగంగా ఒక ఫ్యాన్ చరణ్ కి ఫోన్ చేసి గేమ్ ఛేంజర్ గురించి ఏదైనా సమాచారం చెప్పమని అడగండని వేడుకోవడం బాగా వైరలవుతోంది.

ఇది మా ఫీలింగే అంటూ తోటి ఫ్యాన్స్ షేర్ చేసుకుంటున్నారు. దానికి వరుణ్ తేజ్ సమాధానమిస్తూ ఇవాళ ఉదయం కూడా మాట్లాడానని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోందని వీలైనంత త్వరగా మీకు శుభవార్త వస్తుందని కవర్ చేశాడు. నిజానికి ఈ ప్రశ్న అక్కడి సందర్భానికి సంబంధం లేనిది. అయినా సరే చెప్పక తప్పని పరిస్థితి. విడుదల తేదీ విషయంలో ఏర్పడ్డ సందిగ్దతే ఇలాంటి పరిణామాలకు దారి తీస్తోంది. ఆ మధ్య నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ అన్నారు. కానీ ఇప్పుడా ఛాన్స్ దాదాపు లేనట్టే. సంక్రాంతికి విశ్వంభర ఉంది కాబట్టి అప్పుడూ అవకాశం లేదు.

కొత్తగా డిసెంబరనే ప్రచారం మొదలయ్యింది. ఇది కూడా నిజమని చెప్పడానికి లేదు. దర్శకుడు శంకర్ ఎప్పుడు గుమ్మడికాయ కొడతారో ఆయనకు తప్ప హీరో నిర్మాతకు కూడా తెలియనంత రీతిలో షూట్ జరుగుతోంది. ఇంకోవైపు ఇండియన్ 2కి సంబంధించిన పనులు చూసుకుంటున్న శంకర్ రెండు రిలీజ్ డేట్ల మీద ఒక క్లారిటీ రావాలంటే ఇంకో నెల ఆగాలని నిర్మాతలకు చెబుతున్నారట. అవతల ఇతర ప్యాన్ ఇండియా మూవీస్ మంచి తేదీల మీద కర్చీఫ్ లు వేసి జాగ్రత్త పడుతున్నాయి. కానీ గేమ్ ఛేంజర్ మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలపహరణ చేస్తూనే ఉంది. చూడాలి చివరికేం చేస్తారో.