టిల్లు బిజినెస్ చాలా హాట్ గురూ

టిల్లు స్క్వేర్ ట్రైలర్ ని నెలరోజుల కంటే ముందే విడుదల చేయడం ద్వారా సితార సంస్థ వేసిన వ్యూహాత్మక ప్లాన్ వర్కౌట్ అవుతోంది. బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చేసింది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు థియేట్రికల్ రైట్స్ కు సుమారు ముప్పై అయిదు కోట్ల దాకా ధర పలుకుతోందట. వ్యక్తిగతంగా సిద్దు జొన్నలగడ్డకు అంత మార్కెట్ లేదు. కానీ టిల్లు బ్రాండ్ కు ఉంది. అందుకే బయ్యర్ల నుంచి డిమాండ్ ఎక్కువగా వస్తోందట. మొదటి భాగంతో పోలిస్తే రెండింతలు ఎక్కువ మొత్తమే అయినా వర్కౌట్ అయితే ఖచ్చితంగా మొత్తం వెనక్కు తెచ్చే సత్తా టిల్లుకు ఉంది.

ఈసారి అనుపమ పరమేశ్వన్ తన శైలికి భిన్నంగా లిప్ లాకులు, గ్లామర్ షోకి ఎస్ చెప్పడం టిల్లు స్క్వేర్ కి ప్లస్ అవుతోంది. మూడు నిమిషాల ట్రైలర్ లోనే అన్ని శాంపుల్స్ చూపిస్తే ఇక ఫుల్ మూవీలో అరాచకమేనన్న అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దర్శకుడు మారాడన్న పాయింట్ ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదు. నాన్ థియేట్రికల్ ని సైతం ఫాన్సీ రేట్లకు అమ్మారని తెలిసింది. మొదటి భాగం ఆహాకు ఇస్తే ఇప్పుడీ సీక్వెల్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీన్ని బట్టే ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి మొదటి వారం నుంచి అగ్రెసివ్ ప్రమోషన్లకు ప్లాన్ చేస్తున్నారు.

కేవలం వారం రోజుల గ్యాప్ లో విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ రిలీజ్ ఉండటంతో టిల్లు స్క్వేర్ కి పాజిటివ్ టాక్ రావడం చాలా కీలకం. సంక్రాంతి హంగామా తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ పెద్ద రిలీజులు రాలేదు. హనుమాన్ అయ్యాక వారాల తరబడి థియేటర్లను హౌస్ ఫుల్ చేయించిన బొమ్మ లేదు. మార్చిలో వచ్చే ఆపరేషన్ వాలెంటైన్, గామి, భీమా, ఆ ఒక్కటి అడక్కు లాంటివి అంత రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తాయని ఇప్పుడే చెప్పలేం. సో ఎటు తిరిగి యూత్ ఛాయస్ టిల్లు స్క్వేరే అవుతుంది. హీరో హీరోయిన్ కు సంబంధించి స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్ ని రెడీ చేస్తున్నారు.