ఈ ఏడాది వేసవికి భారీ చిత్రాల మోత మోగిపోతుందని ఆశించారు అభిమానులు. కానీ ఈ సీజన్లో వస్తుందనుకున్న ఒక్కో పెద్ద సినిమా వాయిదా పడిపోతోంది. అల్లు అర్జున్ సినిమా ‘పుష్ప-2’ను చాన్నాళ్ల ముందే వేసవి రేసు నుంచి తప్పించారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా ద్వితీయార్ధానికి వెళ్లిపోయింది. ఇక ఏప్రిల్ 5కి రిలీజ్ డేట్ ఖరారు చేసుకుని ఆ దిశగా అడుగులు వేసిన ‘దేవర’ను సైతం వేసవి బరి నుంచి తప్పించి అక్టోబరు 10కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక వేసవిలో చివరి ఆశ ‘కల్కి’ మీదే ఉంది. ఈ ఒక్క భారీ చిత్రం వస్తే.. మిగతా పెద్ద సినిమాలు లేని లోటు అంతగా తెలియదని అనుకున్నారు. కానీ డేట్ దగ్గరపడేకొద్దీ నమ్మకం సడలిపోతోంది. చిత్ర బృందం నేరుగా వాయిదా సంకేతాలు ఏమీ ఇవ్వకపోయినా.. మే 9న ‘కల్కి’ వస్తుందనే నమ్మకం కలగట్లేదు.
‘కల్కి’ ఆషామాషీ సినిమా కాదు. హాలీవుడ్ రేంజిలో తెరకెక్కుతోంది. బహు భాషల్లో రిలీజ్ చేయాలి. ఈపాటికి షూట్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఒక కొలిక్కి తెచ్చేసి ఉండాలి. కానీ ఇంకా షూట్ ముగిసినట్లు అనిపించడం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ పనులు వేర్వేరు దేశాల్లో జరుగుతున్నాయి. ఈ టైంలోకి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టి ఆన్ లైన్లో సందడి చేస్తుండాలి.
రాజమౌళి సినిమాల రేంజిలో దీనికి పబ్లిసిటీ చేయాల్సి ఉంది. ఆయన రిలీజ్ దగ్గర పడే సమయానికి ఎలా సినిమాను వార్తల్లో నిలబెడతారో చూడాలి. జక్కన్న సినిమాల స్కేల్ ఉన్నప్పటికీ.. ‘కల్కి’ గురించి ప్రస్తుతం ఎలాంటి సౌండ్ లేదు. నిజంగా మే 9న సినిమాను రిలీజ్ చేసేట్లయితే చిత్ర బృందం కచ్చితంగా హాడావుడి చేసేది. రిలీజ్ కౌంట్ డౌన్ కూడా నడిపేది. కానీ అందరూ సైలెంట్‌గా ఉన్నారంటే సినిమా వాయిదా పడబోతోందనే అర్థం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.