భైరవకోన.. జస్ట్ ఊరట మాత్రమే

మామూలుగా ఫిబ్రవరి నెలలో రిలీజయ్యే సినిమాలకు మిగతా రోజుల్లో మాదిరి వసూళ్లు రావు. సంక్రాంతి తర్వాత.. మార్చి మూడో వరకు బాక్సాఫీస్‌కు డ్రై సీజన్‌గా పరిగణిస్తారు. ఏవో కొన్ని సినిమాలు మాత్రమే ఈ టైంలో మంచి వసూళ్లు సాధిస్తాయి. ఈ టైంలో టాక్ అటు ఇటు అయితే వాషౌట్ అయిపోతుంటాయి సినిమాలు. ఈ ఏడాది కూడా సంక్రాంతి తర్వాత చాలా సినిమాలు రిలీజైన సంగతి కూడా తెలియకుండా వెళ్లిపోయాయి. ఇలాంటి టైంలో ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా మాత్రం డివైడ్ టాక్‌ను తట్టుకుని తొలి వీకెండ్లో మంచి వసూళ్లే సాధించింది.

మూడు రోజుల వ్యవధిలో 17-18 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఈ సీజన్లో ఈ సినిమా స్థాయికి.. అందులోనూ డివైడ్ టాక్‌తో సాధించిన ఈ వసూళ్లు గొప్ప అనే చెప్పాలి. దీన్ని బట్టి ప్రి రిలీజ్ హైప్ సినిమాకు బాగా పని చేసిందని చెప్పాలి.

డివైడ్ టాక్‌తోనే ‘ఊరు పేరు భైరవకోన’ ఈ మేరకు వసూళ్లు సాధించిందంటే.. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండుంటే రిజల్ట్ గొప్పగా ఉండేదనడంలో సందేహం లేదు. గత ఏడాది ఇదే జానర్లో వచ్చిన ‘విరూపాక్ష’ తరహాలోనే బ్లాక్ బస్టర్ అయ్యేదీ సినిమా. కానీ ప్రోమోలు ఉన్నంత గొప్పగా సినిమా లేకపోయింది. సక్సెస్ ఫుల్ జానర్లో కథ రాసుకుని అన్ని హంగులూ బాగానే సమకూర్చుకున్నాడు కానీ.. కథను అనుకున్నంత థ్రిల్లింగ్‌‌గా, ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు దర్శకుడు వీఐ ఆనంద్. సినిమాలో హై మూమెంట్స్ లేకపోవడం మైనస్ అయింది.

అయినా సరే బాక్సాఫీస్ దగ్గర సరైన పోటీ లేకపోవడం, థియేటర్లలో చూడదగ్గ చిత్రంలా కనిపించడం ‘ఊరు పేరు భైరవకోన’కు కలిసొచ్చాయి. ఉన్నంతలో సినిమా మెరుగైన వసూళ్లే సాధించింది. చాలా ఏళ్ల నుంచి వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న సందీప్ కిషన్‌కు ఇది కొంత ఊరటనిచ్చిన మాట వాస్తవం. కానీ అతను కోరుకున్న పెద్ద హిట్ అయితే ‘భైరవకోన’ కూడా అందించేలా కనిపించడం లేదు.