వివాదాలు సినిమాలకు పరిమితం కాదు. ఇప్పుడీ ట్రెండ్ వెబ్ సిరీస్ లకూ పాకింది. వ్యవహారాలు కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. ఈ వారం 23 నెట్ ఫ్లిక్స్ లో ‘ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బర్రీడ్ ట్రూత్’ డాక్యు సిరీస్ ని స్ట్రీమింగ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. పన్నెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా రూపొందించారు. అయితే తుది విచారణ ముగిసే వరకు దీన్ని ఆపాలంటూ సిబిఐ బృందం న్యాయస్థానం మెట్లు ఎక్కడం సంచలనంగా మారింది. రేపు 20న దీనికి సంబంధించిన హియరింగ్ జరగనుంది. వాయిదా పడేది లేనిది తెలుస్తుంది.
స్వంత కూతురునే హత్య చేసిన కేసులో ఇంద్రాణి అభియోగాలు ఎదురుకుంటున్నారు. డ్రైవర్ తో పాటు మాజీ భర్త ప్రమేయం కూడా ఇందులో ఉంది. బలమైన సాక్ష్యాలు దొరికాయి కానీ పూర్తి తీర్పు వెలువడలేదు. అందుకే సిబిఐ వైపు నుంచి అభ్యంతరం వస్తోంది. నిజ జీవితంలో జరిగిన క్రైమ్ సంఘటనలను ఆధారంగా చేసుకుని నెట్ ఫ్లిక్స్ తీస్తున్న సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. కేరళను కుదిపేసిన మహిళా సీరియల్ కిల్లర్, సౌత్ ని వణికించిన సైకో హంతకుడి మీద తీసిన డాక్యుమెంటరీలు బ్లాక్ బస్టరయ్యాయి. అందుకే అలాంటి స్టోరీస్ ని వెతికి తీయిస్తోంది.
మీడియాలోనే కాదు కామన్ పబ్లిక్ లోనూ షీనా బోరా మర్డర్ తీవ్ర సంచలనం రేపింది. పరువు హత్యా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పూర్తి నిజాలు బయట ప్రపంచానికి చెప్పలేదు. ఈలోగా నెట్ ఫ్లిక్స్ ఈ నేరంలో భాగం ఉన్నవాళ్లను, సాక్షులను, పోలీస్ అధికారులను సంప్రదించి వివరాలు సేకరించి సిరీస్ పూర్తి చేయించింది. ఒకవేళ దీనికి కనక స్టే విధిస్తే అదో రకం సెన్సేషన్ అనుకోవాలి. అయినా హత్యలు, వాటి వెనుక కారణాలు ఇంత డీటెయిల్డ్ గా జనాలకు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటో కానీ ఆడియన్స్ మాత్రం ఎగబడి చూస్తున్న మాట వాస్తవం.