దినేష్ నాయుడు.. విశ్వక్సేన్ ఎందుకయ్యాడు?

Vishwak Sen

సినిమాల్లోకి రాగానే నటీనటులు తమ సొంత పేర్లను పక్కన పెట్టి స్క్రీన్ నేమ్ కొత్తది పెట్టుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే. మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు.. శివశంకర వరప్రసాద్ కాగా.. మోహన్ బాబు ఒరిజినల్ నేమ్ భక్తవత్సల నాయుడు. ఇంకా ఈ జాబితాలో చాలా పేర్లే ఉన్నాయి.

యువ నటుల్లో ఇలా పేరు మార్చుకున్న వాళ్లలో విశ్వక్సేన్ ఒకడు. అతడి అసలు పేరు దినేష్ నాయుడు. సినిమాల్లోకి వచ్చాక కూడా అతను ఈ పేరుతోనే కొనసాగాడు. ఆ పేరుతోనే హీరోగా తొలి సినిమా చేశాడు. కానీ ఆ సినిమా థియేటర్లలో రిలీజయ్యే సమయానికి పేరు మారిపోయింది. అలా అని ఇండస్ట్రీ వ్యక్తులెవరూ తన పేరు మార్చలేదట. న్యూమరాలజీ ప్రకారం తన పేరును విశ్వక్సేన్‌గా ఇంట్లో వాళ్లే మార్చినట్లు అతను వెల్లడించాడు.

“నేను దినేష్ నాయుడు పేరుతోనే సినిమాల్లోకి వచ్చా. ‘వెళ్ళిపోమాకే’ సినిమా చేస్తున్నపుడు కూడా నా పేరు అదే. ఐతే ఆ సినిమా రిలీజ్ చాలా ఆలస్యం అయింది. ఎంతకీ విడుదలకు నోచుకోలేదు. ఆ సమయంలోనే మా ఇంట్లో వాళ్లు న్యూమరాలజీ మీద నమ్మకంతో నా పేరు మార్చాలనుకున్నారు. విశ్వక్సేన్ అని కొత్త పేరు పెట్టారు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత నాకు అన్నీ కలిసొచ్చాయి. నా పేరు మార్చిన రెండు వారాలకే వెళ్ళిపోమాకే రిలీజైంది. ఆ తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’ చేస్తుండగానే ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో అవకాశం వచ్చింది. సంఖ్యా శాస్త్రం, జ్యోతిషం, వాస్తు లాంటి వాటిని నేను ఎంత నమ్ముతాను అని చెప్పలేను. కానీ వాటిని నేను వాటిని అగౌరవపరచను. ఎవరి నమ్మకాలు వాళ్లవి. నా విషయంలో మాత్రం పేరు మార్చుకున్నాక అన్నీ సినిమాటిగ్గా జరిగాయి” అని విశ్వక్ తెలిపాడు.