మూడు వందల యాభై సినిమాలకు పైగా రచన చేసిన అనుభవం, ఎన్నో పాత్రల్లో నటించిన సుదీర్ఘ కెరీర్ సొంతం చేసుకున్న పరుచూరి గోపాలకృష్ణ గారు ప్రస్తుతం పెన్నుకి విశ్రాంతినిచ్చినా నిత్యం అప్డేట్ అవుతూ కొత్త రిలీజుల్లోని మంచి చెడుల గురించి చర్చిస్తూ పాఠాల రూపంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ఇటీవలే ఓటిటిలో వచ్చిన గుంటూరు కారం గుంరించి ఆయన పంచుకున్న విషయాలు అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. మహేష్ బాబు డెబ్యూ రాజకుమారుడు, ఇండస్ట్రీ హిట్ ఒక్కడు లాంటి వాటిలో ఈయన కలం ఎంత దోహపడిందో వసూళ్ల సాక్షిగా చూశాం.
అలాంటి పరుచూరి చెప్పిన ముచ్చట్లలో కొన్ని కీలక అంశాలున్నాయి. తల్లి కొడుకు సెంటిమెంట్ గా కథను రాసుకున్న త్రివిక్రమ్ దాన్ని అంతే ఎమోషనల్ గా తెరమీద చూపించే క్రమంలో అవసరం లేని సన్నివేశాలతో స్క్రీన్ ప్లే రాసుకుని ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేశారని అన్నారు. టైటిల్ లో కారం పెట్టి దానికి అనుగుణంగా సీన్లు పేర్చారు తప్పించి ఈ స్టోరీకి గుంటూరు వారి అబ్బాయి అని పెడితే ఇంకా యాప్ట్ గా ఉండేదని చెప్పుకొచ్చారు. కేవలం వెంకటరమణతో సంతకం పెట్టించుకోవడం కోసం శ్రీలీల అతని ఇంటికొచ్చి ప్రేమలో పడటం కృతకంగా ఉందని, ఏ మాత్రం పండలేదని తేల్చేశారు.
అంతే కాదు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లలో మార్పు తీసుకొస్తారేమో అని ఎదురు చూస్తుంటే క్లైమాక్స్ ముందు వరకు అలాంటివేవీ చేయకపోవడం దెబ్బ తీసిందని అన్నారు. ఎన్నో గొప్ప సినిమాలు రాసిన తీసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఫిలిం మేకర్ నుంచి గుంటూరు కారం అవుట్ ఫుట్ ని ఆశించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్షన్ల గురించి కూడా చిన్న కౌంటర్ వేయడం కొసమెరుపు. ఏది ఏమైనా ఒక లెజెండరీ రైటర్ ఈ సినిమా గురించి ఇంత వివరంగా శల్యపరీక్ష చేయడం ఒకవిధంగా నేర్చుకోవాల్సిన లెసనే. వీడియో త్రివిక్రమ్ దాకా చేరే ఉంటుంది కానీ రియాక్షన్ చూడలేంగా.