కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలైనా సరే బ్రహ్మరథం దక్కించుకోవడం చూస్తున్నాం. మన దగ్గర బలగం లాంటివి ఎంత సెన్సేషన్ అయ్యాయో తెలిసిందే. తాజాగా మలయాళంలో రిలీజైన ప్రేమలు సంచలనం సృష్టించే దిశగా వసూళ్లు సాధిస్తోంది. విశేషం ఏంటంటే ఇది పూర్తిగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన లవ్ డ్రామా. గిరీష్ దర్శకత్వం వహించగా మొదటి రోజు పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో అడుగు పెట్టింది. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో తీస్తే వారం తిరక్కుండానే 6 కోట్లు దాటేసి కనీసం యాభై కోట్లకు పైగా రాబడుతుందనే అంచనాతో పరుగులు పెడుతోంది.
దీని గురించి మనమెందుకు చెప్పుకోవాలంటే ఈ ప్రేమలు తెలంగాణ నేపథ్యంలో జరుగుతుంది. చదువులో బ్యాక్ లాగ్స్ తో సతమతమయ్యే ఒక కుర్రాడు యుకెకి వెళ్లి జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో ఉంటాడు. అదే సమయంలో చురుకుగా ఉండే ఓ అమ్మాయి తన మొదటి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఇద్దరూ ఒక పెళ్లి సందర్భంలో కలుసుకుంటారు. గేట్ పరీక్ష కోసం ఫ్రెండ్ తో కలిసి కోచింగ్ తీసుకుంటున్న కుర్రాడికి, లైఫ్ పట్ల చాలా క్లారిటీ ఉన్న ఉద్యోగిని ఎలా ప్రేమ పుట్టిందనేది మెయిన్ పాయింట్. బోలెడు సబ్ ప్లాట్స్ కథలో భాగంగా వస్తాయి.
లైన్ పరంగా వింటే ఎలాంటి కొత్తదనం అనిపించదు కానీ సహజమైన సంభాషణలు, భావోద్వేగాలు, చక్కని హాస్యంతో దర్శకుడు గిరీష్ ఈ ప్రేమలుని తీర్చిదిద్దిన తీరు ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు ఇదే తరహాలో ప్రేమమ్ సాధించిన విజయం సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి కానుకగా ఇచ్చింది. ఇప్పుడు ప్రేమలులో కూడా అలాంటి క్యాస్టింగ్ బోలెడు ఉంది. టాలీవుడ్ నిర్మాతలు కొందరు రీమేక్ చేయాలా లేక డబ్బింగ్ చేయాలా అనే ఆలోచనలో ఇప్పటికీ ఒరిజినల్ వెర్షన్ నిర్మాతలను సంప్రదించారట. ఎవరికి దక్కుతుందో చూడాలి.