చిరంజీవి వెబ్ సిరీస్ వార్తల్లో నిజమెంత

మెగాస్టార్ చిరంజీవి ఒక వెబ్ సిరీస్ ఒప్పుకున్నారనే వార్త రెండు మూడు రోజుల క్రితం బాగానే చక్కర్లు కొట్టింది. విశ్వంభరలో బిజీగా ఉన్న చిరు దీన్ని చేస్తారని తెలిసి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. వాస్తవాలేంటో తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని ఆసక్తికరమైన సంగతులు తెలిశాయి. మంచి సబ్జెక్టు దొరికితే చేయాలని ఆయన మనసులో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పకిప్పుడు ఎలాంటి కమిట్ మెంట్స్ ఇవ్వలేదట. రానా నాయుడు విషయంలో వెంకటేష్ ఎదురుకున్న క్రిటిసిజంని దృష్టిలో పెట్టుకుని కేవలం కథని విని గుడ్డిగా ఒప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

నిజానికి ఆహా కోసం అల్లు అరవింద్ ఇలాంటి ప్రతిపాదన రెండేళ్ల క్రితమే తీసుకొచ్చారు. కానీ స్టోరీ, దర్శకుడు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో అదే ప్లాట్ ఫార్మ్ లో వచ్చిన సమంతా టాక్ షోకి అతిధిగా, సింగర్ షోకి గెస్టుగా వచ్చి బ్రాండ్ బిల్డింగ్ కి కొంత తోడ్పడ్డారు చిరు. తర్వాత మళ్ళీ ఎలాంటి ప్రణాళికలు అనుకోలేదు. తర్వాత నెట్ ఫ్లిక్స్ సైతం ఓ ప్రొపోజల్ ని తయారు చేసి రామ్ చరణ్ ద్వారా చిరంజీవి దాకా తీసుకెళ్లింది కానీ వాళ్ళ కంటెంట్ లోని బోల్డ్ నెస్ గురించి ముందే అవగాహన ఉన్న చిరు సున్నితంగా దాన్ని పెండింగ్ లో ఉంచారట. ఇది తెరవెనుక జరుగుతున్న కథ.

బుల్లితెరపై కనిపించకూడదనే నియమం చిరంజీవి పెట్టుకోలేదు. అందుకే గతంలోనే మీలో ఎవరు కోటీశ్వరుడుకి హోస్ట్ గా చేశారు. అంతగా వర్కౌట్ కాలేదు కానీ దాన్ని నడిపించిన విధానం బాగానే పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత టీవీకి దూరంగా ఉన్నారు. విశ్వంభర అయ్యాక హరీష్ శంకర్, అనిల్ రావిపూడిలు ఆయన కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. రవితేజ, వెంకటేష్ లతో వాళ్ళ సినిమాలు పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్లు సిద్ధం చేసుకుని చిరంజీవికి వినిపిస్తారు. ఈ గ్యాప్ లో వెబ్ సిరీస్ లు గట్రా అంత సులభంగా జరిగే వ్యవహారాలు కాదు. సో ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అవ్వొచ్చు.