అవుట్‍ ఫోకస్‍లో రాధేశ్యామ్‍!

ప్రభాస్‍ మళ్లీ వెండితెరపై కనిపించేది రాధేశ్యామ్‍లో. యూరప్‍ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందుతోన్న ఈ చిత్రానికి కోవిడ్‍ కారణంగా బ్రేక్‍ పడింది. మళ్లీ అక్కడకు వెళ్లేందుకు పర్మిషన్లు వచ్చేలోగా అక్టోబర్‍ నుంచి ఇక్కడ సెట్స్లో కొంత భాగం షూటింగ్‍ పూర్తి చేయనున్నారు.

ప్రభాస్‍ నుంచి ఇమ్మీడియట్‍గా వచ్చేది ఇదే సినిమా అయినా కానీ నాగ్‍ అశ్విన్‍తో చేసే చిత్రం, ఆదిపురుష్‍ రెండూ ఎక్కువ ట్రెండ్‍ అవుతున్నాయి. బాహుబలితో వచ్చిన ఇమేజ్‍ తర్వాత ప్రభాస్‍ ఎంచుకున్న ప్రాజెక్ట్ కాదిది. బాహుబలి నిర్మాణ దశలో వుండగా సుజీత్‍తో పాటు రాధాకృష్ణ కుమార్‍తో సినిమా చేస్తానని ప్రభాస్‍ మాట ఇచ్చాడు. అలా సాహో, రాధేశ్యామ్‍ మొదలయ్యాయి.

నిజానికి ప్రభాస్‍కి ఇప్పుడున్న ఇమేజ్‍కి, అతని సినిమాలపై పెడుతోన్న పెట్టుబడికి న్యాయం చేసేంత అనుభవం ఈ యువ దర్శకులకు లేదు. ఒక దశలో రాధేశ్యామ్‍ ఆపేసారని కూడా వదంతులు వినిపించాయి. సాహో ఫెయిలైన తర్వాత మళ్లీ ఈ సినిమా కథపై కొన్ని నెలలు వర్క్ చేసారు. అందుకే షూటింగ్‍ డిలే అయింది. లేదంటే ఈపాటికి షూటింగ్‍ పార్ట్ పూర్తయిపోయేదే.

ఏదేమైనా ప్రభాస్‍ తలపెట్టిన పాన్‍ ఇండియా ప్రాజెక్టుల వల్ల రాధేశ్యామ్‍ అవుట్‍ ఫోకస్‍లోకి వెళ్లింది. రాధాకృష్ణకుమార్‍ తన సినిమాపై ఆసక్తి పెంచడానికి అసందర్భంగా ట్వీట్స్ పెట్టడంలోనే ఈ చిత్రం ఎంతగా మీడియా దృష్టిని, ఫాన్స్ ఆసక్తిని కూడా కోల్పోయిందనేది అర్థమవుతోంది.